మిర్యాలగూడ ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత ప్రణయ్ ఇంట్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ప్రణయ్ ఇంటి చుట్టూ గత రెండు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో అమృత మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమృత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సిసిటివి ఫుటేజిలు పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. అతను పట్టణంలోని కార్తీక్ టెక్స్ టైల్స్ దుకాణం నిర్వహిస్తున్న గడ్డం వినోద్ కుమార్ గా గుర్తించారు. అతడు గత కొన్ని రోజులుగా ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకొని వారి ఇంటికి వచ్చి వెళుతున్నాడు. అదే విధంగా రాత్రి వేళలో ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అతని సెల్ ఫోన్ డేటా పరిశీలించగా అమృత తల్లితో అతడు మాట్లాడినట్టుగా నిర్ధారించారు. ఉదయం వారితో మంచిగా ఉన్నట్టు నటించి రాత్రి పూట ఇంటి చుట్టు తిరిగాడని తేల్చారు.
తన తండ్రి ప్రోద్బలంతోనే వినోద్ తమ ఇంటికి వస్తున్నాడని అమృత ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని సీఐ నాగరాజు తెలిపారు. గతంలో కూడా ప్రణయ్ ఇంటి చుట్టూ ఇద్దరు రెక్కి నిర్వహించినట్టు గుర్తించారు. అప్పటి నుంచి ప్రణయ్ ఇంటి వద్ద ఇద్దరు పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.
అమృత, ప్రణయ్ ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారు. కూతురు కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి కిరాతకంగా ప్రణయ్ ని చంపించాడు. కిరాయి రౌడీలకు సుఫారి ఇచ్చి ప్రణయ్ ని అంతమొందించాడు. ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాగా, ప్రణయ్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అమృత తండ్రి మారుతీరావు కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో రగిలిపోయి బీహార్ నుంచి కిరాయి రౌడీలను పిలిపించాడు. అమృత, ప్రణయ్ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా పట్టపగలే నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ప్రణయ్ ని కిరాయి రౌడీ కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.