బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిపై లైవ్ లో చెప్పుతో కొట్టిన అమరావతి జేఏసీ నేత

Amravati JAC leader slaps BJP leader Vishnuvardhan Reddy live

ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పుతో దాడి చేయటం సంచలనమైంది. టీవీ చ‌ర్చ‌ల్లో రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య వాదోప‌వాదాలు కొన్నిసార్లు శ్రుతి మించిపోవ‌డం.. తీవ్ర స్థాయిలో దూష‌ణ‌ల‌కు దిగ‌డం మామూలే. కొన్నిసార్లు ఒక‌రి మీద ఒక‌రు చేయి చేసుకునేవ‌ర‌కు కూడా ప‌రిస్థితులు వెళ్లిపోతుంటాయి. తాజాగా జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది.

అమరావతిలో 50 శాతం, అంతకుమించి పూర్తై ఆగిపోయిన నిర్మాణాలను రూ.3 వేల కోట్లతో పూర్తి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి మెట్రో రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఈ పనులు అప్పగిస్తూ ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే హఠాత్తుగా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి, రాజధాని తరలింపు విషయంలో జగన్ ఆలోచన మారిందా? లేక కేవలం విజయవాడ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ ఎత్తుగడ వేశారా అన్న అంశంపై చర్చించడానికి ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబేట్ పెట్టింది.

ఆ డిబేట్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికలపూడి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారు. చర్చ సందర్భంగా శ్రీనివాస్‌ను పెయిడ్ ఆర్టిస్ట్ అని విష్ణువర్ధన్ రెడ్డి అనడంతో… దానికి రెచ్చిపోయిన శ్రీనివాస్ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కాలి చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డిపై విసిరారు. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. సమన్వయం పాటించే వ్యక్తులనే ఇలాంటి కార్యక్రమాలకు పిలవాలని ఆయన అన్నారు. ఆయనపై సదరు న్యూస్ ఛానెల్ వారే ఫిర్యాదు చేసి.. అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు.