Chandrababu: రాష్ట్ర రాజకీయాలలో పెరుగుతున్న ఉత్కంఠ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలను రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. అమిత్ షా పర్యటనలో మొదటి అజెండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో జరగబోయే సమావేశం.
శనివారం రాత్రి ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి చేరుకొని హైలెవెల్ డిన్నర్‌లో పాల్గొననున్నారు. ఈ భేటీలో ఇద్దరు నేతలు కూటమి కూటమి సంబంధాలపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాత్రి భోజనం అనంతరం అమిత్ షా విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేయనున్నారు.
ఆ తరువాతి రోజు జనవరి 19న గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రీస్పాన్స్ ఫోర్స్), ఎన్ఐడీఎం (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) కార్యాలయాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించి కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించబోయే సహాయంపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన కోసం బయల్దేరుతారు. ఈ పర్యటనలో చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేయనున్నారు. ఇక అమిత్ షా పర్యటన టీడీపీ-బీజేపీ కూటమి భవిష్యత్తుకు కీలకంగా మారనుందా లేకా సాధారణ పరిపాలనా సమావేశంగా ముగుస్తుందా అనే అంశం ప్రస్తుతం రాజకీయ పరిశీలకులలో చర్చనీయాంశమైంది.