వెదుకుప్పం మండలం దేవలంపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనతో దళితులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ చర్య దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, స్థానికులు డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం స్థానిక నాయకుడైన సతీశ్ నాయుడికి ఇష్టం లేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. సతీశ్ నాయుడే ఈ అకృత్యానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా విగ్రహం తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిందితులను అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఈ ఘటనతో దేవలంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ, నగరి డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

