రాజీనామాతో సరి.! అంబటి రాయుడు పెదవి విప్పడా.?

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, వైసీపీలో అట్టహాసంగా వైసీపీలో చేరాడుగానీ, నెల రోజులు కూడా ఆ పార్టీలో వుండలేకపోయాడు. వాస్తవానికి అంబటి రాయుడు వల్ల వైసీపీకి వచ్చే ఓట్లు పెద్దగా ఏమీ వుండవు. కాకపోతే, ఆ ఫ్యాక్టర్ కొంత పాజిటివ్ ఓటింగ్ పెరగడానికి కారణమవుతుందని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారంతే.

గుంటూరు ఎంపీ సీటుకి అభ్యర్థిగా అంబటి రాంబాబు పేరు ప్రకటిస్తారన్న ప్రచారం, అది నమ్మి అంబటి రాయుడు వైసీపీలో చేరడం తెలిసిన విషయాలే. అప్పటిదాకా ఆయనకు టిక్కెట్టు ఇవ్వాలనే వైసీపీ అధినాయకత్వం అనుకుంది. కానీ, ఆ తర్వాత ఈక్వేషన్స్ మారాయ్.ఇంతలోనే, అంబటి రాయుడిలో ఓపిక నశించి, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

అసలు ఓపిగ్గా ఎదురు చూసిందెక్కడ.? తక్కువ సమయంలోనే ఓపిక నశించేసింది అంబటి రాయుడికి. అసలు అంబటి రాయుడు ఇప్పుడేం చేస్తున్నాడు.? రాజీనామా ప్రకటన చేసేసి చేతులు దులిపేసుకుంటే ఎలా.?

‘పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా దూషించమన్నారు. అది నాకు ఇష్టం లేదు. నేనెవర్నీ విమర్శించదలచుకోలేదు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలనుకున్నాను.. అందుకే, వైసీపీలో ఇమడలేకపోయాను..’ అంటూ అంబటి రాయుడు తన సన్నహితుల వద్ద వాపోయాడట. నిజంగానే వాపోయాడా.? లేదంటే, అలాంటి లీకు ఒకటి వ్యూహాత్మకంగా బయటకు వచ్చిందా.?

రాజకీయ ప్రత్యర్థుల్ని నానా బూతులూ తిట్టిన హిందూపూర్ సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కే టిక్కెట్టు దక్కలేదాయె.! అంటే, బూతులు ప్రయార్టీ కానే కావు.! కానీ, వైసీపీని వీడుతున్న చాలామంది నేతలు ‘తిట్టలేకనే, మారిపోతున్నాం..’ అనే వ్యాఖ్యలు చేస్తున్నారు.

మిగతా వాళ్ళ విషయం వేరు. అంబటి రాయుడి విషయం వేరు. ఈ మొత్తం వ్యవహారంపై అంబటి రాయుడు పెదవి విప్పాల్సిందే.! విప్పుతాడా మరి.?