అంబటి రాయుడ్ని రారమ్మంటున్న రాజకీయం.!

క్రికెట్ మైదానంలోనూ యార్కర్లుంటాయ్.. రన్ ఔట్లు తప్పవు ఒక్కోసారి.! హిట్ వికెట్ సమస్యనీ ఎదుర్కోవాల్సి వస్తుంది.! అంపైరింగ్ తప్పిదాల సంగతి సరే సరి.! రాజకీయాల్లో అంతకు మించి.!

ఇప్పుడిదంతా ఎందుకంటే, క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడట. రాయుడంటే, మైదానంలో భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. స్టామినాకి తగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదంటారు రాయుడి అభిమానులు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున పలు మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో అయితే ఇరగదీసేశాడు.

క్రికెట్ ఇన్నింగ్స్‌కి గుడ్ బై చెప్పేసి, రాజకీయ రంగంలోకి దిగాలనుకుంటున్నాడు అంబటి తిరుపతి రాయుడు. ఆ ఉద్దేశ్యంతోనే కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తేస్తూ ఓ ట్వీటేశాడు కూడా.

రాజకీయాలకు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించేయడంతో, ఆయన్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే, ఇంతవరకు అంబటి రాయుడు ఏ పార్టీలో చేరే విషయమై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

అనూహ్యమైన విషయమేంటంటే, తెలంగాణ రాజకీయాల్లో కూడా అంబటి తిరుపతి రాయుడు పేరు వినిపిస్తుండడం. ఏమో, అంబటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోగానీ.. రాజకీయ వర్గాల్లో అయితే ఆయన పేరు మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది.

రాజకీయాల్లోకి వచ్చేవరకే ఇదంతా.! వచ్చాక.. అంతా హంబక్.!