హిట్ వికెట్ అనాలా.? అబ్బే, బ్యాటింగే మొదలు పెట్టలేదు కదా.! రిటైర్డ్ హర్ట్ అయ్యాడా.? కాదు కాదు, అసలంటూ మైదానంలోకి రాకుండానే ఔటయ్యాడు.! ఏమనాలి.? అసలు అంబటి రాయుడు పొలిటికల్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడాన్ని ఎలా అభివర్ణించాలి.?
జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే.! బోల్డంత వయసుంది.. ఆయన్ని పలు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి కూడా.! సో, అంబటి రాయుడు ముందు ముందు ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి సరికొత్తగా రాజకీయ ప్రయాణాన్ని పునఃప్రారంభించే అవకాశాలున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. పెద్ద షాకే ఇచ్చాడు. వైసీపీకి ఆయన ఇచ్చిన షాక్ అలాంటిలాంటిది కాదు.! అభిమానులకు మాత్రం బోల్డంత సంతోషాన్నిచ్చాడు. వైసీపీ రాజకీయ ప్రత్యర్థులకూ అవసరమైన పాజిటివ్ కంటెంట్ ఇవ్వడంలో అంబటి రాయుడు తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.
అసలేం జరిగింది.? కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అంబటి రాయుడు ఎందుకు, కొద్ది రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు.? కొద్ది రోజుల్లోనే వైసీపీ అంతలా అంబటి రాయుడికి మొహం మొత్తేయడానికి కారణమేంటి.? ట్విట్టర్ వేదికగా తన రాజీనామాను అంబటి రాయుడు ప్రకటించేశాడు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా చెప్పాడు.
ఇవన్నీ రాజకీయాల్లోకి రాకముందు ఆలోచించుకోవాల్సిన విషయాలు. వాస్తవానికి గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేశాడు అంబటి రాయుడు. టీడీపీ నుంచి పిలుపు వచ్చింది. జనసేనలో ఆయన చేరితే బావుంటుందని కొందరు జనసైనికులూ భావించారు. కానీ, వైసీపీ వైపు మొగ్గు చూపాడు అంబటి రాయుడు.
వైసీపీ నేతలతో కలిసి తిరిగాడు, వైసీపీలో చేరాడు. ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో నాణ్యత లేని బ్యాట్లు తొలి బంతికే విరిగితే, ‘బాగా ఆడితే బ్యాట్లు విరుగుతాయ్’ అంటూ అర్థం పర్థం లేని కవర్ డ్రైవ్స్ ఇచ్చాడు. తద్వారా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.
ఏం జరిగిందోగానీ, వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పేశాడు. టిక్కెట్ కోసం వైసీపీ అధినాయకత్వం పెద్ద మొత్తంలో గ్యారంటీ అడిగిందనీ, అది నచ్చక అంబటి వైసీపీకి గుడ్ బై చెప్పాడనీ అంటున్నారు. నిజమేనా.?