గతకొన్ని రోజులుగా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశంపై ఏపీ రాజకీయాల్లో చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని.. యువత రాజకీయాల్లోకి రావాలనే అంశం తనకు ఆసక్తిని కలిగించిందని.. రాబోయే ఎన్నికల్లో ఏపీ నుంచి ఎంపీగా పోటీచేయాలని ఉందని అంబటి ఈమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి తాను పోటీచేసేదీ రాయుడు చెప్పలేదు.
ఈ క్రమంలో… తాజాగా ఏపీ ప్రభుత్వ పోస్టులపైనా, జగన్ ఫోటోలపైనా అంబటి రాయుడు లైక్స్ కొట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి అనుకూలంగా అంబటి రాయుడు వ్యవహరిస్తున్నాడంటూ ఆన్ లైన్ వేదికగా కామెంట్లు మొదలైపోయాయి. అవును… వైసీపీ పార్టీని, సీఎం వైఎస్ జగన్ ను అంబటి రాయుడు సోషల్ మీడియాలో అనుసరిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ పెట్టిన పోస్టులకు కూడా ఆయన లైక్ కొడుతున్నారు. దీంతో… రాయుడు వైసీపీలో చేరిపోబోతున్నారంటూ కథనాలు మొదలైపోయాయి.
ఈ సందర్భంలో తాజాగా సచివాలయాల కన్వీనర్లు తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిని కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. వైసీపీ కుటుంబాన్ని చూసి గర్విస్తున్నానని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా జగన్ జత చేశారు. ఈ నేపథ్యంలో జగన్ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్టును అంబటి రాయుడు లైక్ కొట్టడం విశేషం.
ఇదేవిధంగా… వైఎస్ జగన్ ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ ఖాతాలను ఫాలో అవుతున్న అంబటి రాయుడు… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు వైఎస్ జగన్ చేసిన ప్రసంగాలతో కూడిన రీల్స్ ను తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. దీంతో… త్వరలో ఐపీఎల్ కు విరామం ఇచ్చి 2024 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిపోతారని.. అనంతరం ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఆన్ లైన్ వేదికగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి!