జగన్‌ ను కలిసిన అంబటి రాయుడు… తెరపైకి రెండో సైడ్‌!

రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్‌ ను మొదటిసారి కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భేటీతో రాయుడు రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తాజాగా తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయుడు ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్‌ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. దింతో… జగన్‌ అంబటిని, అతను ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ను ఈ సందర్భంగా అభినందించారు.

అయితే గతకొంతకాలంగా తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం స్ వేదికగా జగన్ సర్కార్ పై అంబటి రాయుడు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యువత రాజకీయాల్లోకి రావాలనే మాట తనను బాగా ఆకర్షించిందని, తాను కూడా రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నానని ఒకానొక సమయంలో ఓపెన్ అయిపోయారు అంబటి.

దీంతో నాటి నుంచి అంబటి ఏపార్టీలో చేరబోతున్నారు.. చేరిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ అనేక రకాల ప్రశ్నలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేశాయి. అయితే ఆ ఊహాగాణాలకు తెరదింపుతున్నారో ఏమో కానీ… తాజాగా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంబటి రాయుడు కలిశారు.

కాగా, 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. ఐపీఎల్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడారు. త్వరలోనే తన సెకండ్‌ సైడ్‌ చూస్తారని మే 30న అంబటి రాయుడు ట్వీట్‌ చేశారు. సీఎం జగన్‌ ను పదే పదే కలుస్తుండటంతో రాజకీయాల్లోకి ఎంట్రీయే ఆ రెండో సైడ్‌ అని ఆల్ మోస్ట్ ఫిక్సయిపోతున్నారు ఏపీ జనాలు!