“పుట్టగతులు లేకుండా పోతావు పవన్”!

వారాహి యాత్రలో భాగంగా తొలిరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం నేతలు మండిపడుతున్నారు. ఈ సభలో జగన్ సర్కార్ పై పవన్ చేసిన విమర్శలపై ఇప్పటికే మాజీమంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. అసత్యాలు ప్రచారం చేస్తే మక్కెలిరుగుతాయంటూ రెండు చెప్పులూ చూపించారు.

ఈ సమయంలో పవన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పార్టీపెట్టి పదేళ్లు దాటిన వ్యక్తి, రాజకీయాల్లో పన్నెండేళ్ల అనుభవం ఉన్న పవన్… తన లక్ష్యం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లడం అనే పరిస్థితి వచ్చాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకుడిని నమ్మడం విషయంలో ఆయన వెనక ఉన్న కార్యకర్తలు పూన్రాలోచించుకోవాలని అంబటి సూచించారు.

ఇదే సమయంలో పవన్ చెప్పిన సరికొత్త వ్యూహంపై కూడా స్పందించిన అంబటి… పవన్ అసెంబ్లీకి వెళ్లడానికి షణ్ముఖ వ్యూహం అవసరం లేదని, చంద్రబాబు కాళ్లు పట్టుకుంటే సరిపోద్దని సూచించారు. ఇదే సమయంలో ఎప్పుడేమి మాట్లాడుతున్నాడో స్పష్టత లేకుండా రాజకీయాలు చేస్తున్నారని అంబటి సెటైర్స్ వేశారు. ఫలితంగా… తాను కన్ ఫ్యూజ్ అవుతూ, తన కేడర్ ను కన్ ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కలిసి వెళ్తానో ఒంటరిగా వెళ్తానో అని సందేహం క్రియేట్ చేసిన పవన్ వ్యాఖ్యలపైనా అంబటి స్పందించారు. ఇదంతా పాతచింతకాయ పచ్చడి వ్యవహారమని.. ఇప్పటికే కలిసి వెళ్తామని ప్రకటించారని గుర్తు చేశారు.

ఇక “కాపుల రిజర్వేషన్ విషయంలోనూ, కాపులను బీసీల్లో చేర్చే హామీ విషయంలోనూ ఏనాడైనా చంద్రబాబుని ప్రశ్నించావా” అంటూ పవన్ ను ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈ విషయంపై ప్రశ్నించిన ముద్రగడను హింసింస్తున్నప్పుడు, వేదిస్తున్నప్పుడు “నువ్వు ఎక్కడున్నవ్ పవన్ కల్యాణ్” అంటూ అంబటి దుయ్యబట్టారు.

అనంతరం.. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కి లేదని, దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారని, ఫలితంగా పవన్ కు పుట్టగతులు కూడా ఉండవని, అతన్ని కులం కూడా క్షమించదని, కులం మొత్తాని తీసుకునివెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని అంటూ అంబటి ఫైరయ్యారు!