స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… చంద్రబాబు జైలు జీవితం తాజాగా 28వ రోజుకి చేరింది. ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు జైల్లోకి వెళ్లినప్పటినుంచీ టీడిపీ పరిస్థితి గాలివానలో, వాననీటిలో పడవ ప్రయాణంలా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు లేని టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం టీడీపీ కేడర్ ను ఉత్సాహ పరచాల్సిన బాధ్యత కూడా పవన్ కల్యాణ్ తీసుకోగా… లోకేష్ ఢిల్లీకే పరిమితమవుతున్నారు. మరోపక్క “మోత మోగిద్దాం.. “క్రాంతి కాంతి” వంటి కార్యక్రమాలతో బ్రాహ్మణి తనదైన పాలిటిక్స్ చూపిస్తున్నారు.
ఈ సమయంలో మైకందుకున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు… పవన్, లోకేష్, బాలకృష్ణలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ముగ్గురినీ ఏపీలో పొలిటికల్ బఫ్యూన్స్ అంటూ కన్ క్లూజన్ కి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురిపైనా అంబటి రాంబాబు చేసిన కామెలు వైరల్ అవుతున్నాయి.
నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురూ ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ బఫూన్స్ లా మారారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. వీళ్ల మాటలు కామెడీగా ఉంటాయని, ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదని అన్నారు. ఇందులో భాగంగా… అవనిగడ్డ మీటింగ్ లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత మీటింగ్ లో ఎన్డీఏలోనే ఉన్నానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇక, చంద్రబాబు అవినీతిపై గడప గడపకూ ప్రచారం చేస్తానని నారా లోకేష్ అంటున్నారని, వీరిద్దరికీ ఇప్పుడు బాలకృష్ణ జతకలిశారని.. ఈ ముగ్గురు పొలిటికల్ బఫూన్స్ లా మారారని మంత్రి అంబటి రాంబాబు వెటకారమాడారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలకు జనం పలచబడుతున్నారనే విషయాన్ని ప్రస్థావించారు అంబటి!
పవన్ కల్యాణ్ వారాహి యాత్రలు ఫ్లాప్ అయ్యాయని చెబుతున్న అంబటి రాంబాబు… టీడీపీతో పొత్తు ప్రకటన వెలువడకముందు పవన్ యాత్రలకు, ఇప్పుడు యాత్రకూ తేడా గమనించాలని, జనం ఎందుకు తగ్గారనే విషయాలపై పవన్ దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. ఇదే సమయంలో… పవన్, చంద్రబాబు పొత్తుని ప్రజలు అంగీకరించడం లేదని తెలిపారు.
ఇదే సమయంలో… చంద్రబాబు చేసిన స్కాంలపై ఒక పక్క విచారణ జరుగుతోందని, ఇందులో పవన్ పాత్ర కూడా కచ్చితంగా ఉందనే అనుమానం కలుగుతోందని చెప్పిన మంత్రి అంబటి రాంబాబు… అవినీతితో అరెస్టు అయిన వ్యక్తికి పవన్ మద్దతు ఇవ్వడం వెనక కారణం లంచాల్లో వాటానే అని అభిప్రాయపడ్డారు. రామోజీరావు మార్గదర్శిలో, రాధాకృష్ణ ఖాతాలో కూడా అవినీతి సొమ్ము పడే ఉంటుందని మంత్రి అంబటి సందేహం వ్యక్తం చేశారు.
అనంతరం “క్రాంతి – కాంతి” అంటూ టీడీపీ మరో వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయంపైనా అంబటి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా రాత్రి 7 గంటలకు అందరూ లైట్లు ఆపేసి నిరసన తెలపాలని బ్రాహ్మణి పిలుపునిచ్చిన నేపథ్యంలో… ఈ కార్యక్రమంపై మంత్రి అంబటి సెటైర్లు పేల్చారు. చంద్రబాబు ఎన్నో కుటుంబాల దీపాల్ని ఆర్పేశారని.. అలాంటి వ్యక్తి కోసం కొత్తగా దీపాల్ని ఆర్పడం ఎందుకని ప్రశ్నించారు.