బీజేపీలో సరిగ్గా గౌరవం లేదని, తనను గౌరవించే పార్టీలో కొనసాగడమే తనకు మక్కువని చెప్పి టీడీపీలో చేరిపోయారు కన్నా లక్ష్మీనారాయణ. అనంతరం చంద్రబాబు కుర్చీలో కూర్చుని ఉంటే.. పక్కన చేతులు కట్టుకుని నిలబడటం.. చంద్రబాబు సత్తెనపల్లి వస్తే ప్రచార వాహనం కింద టైర్ పక్కన నిలబడటం తెలిసిందే! ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా అంబటి రాంబాబు… కన్నా లక్ష్యంగా కొత్త పావులు కదిపారు. దీంతో… సత్తెనపల్లి లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
సత్తెనపల్లి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ నుంచి టీడీపీలో చేరేటప్పుడే సత్తెనపల్లి సీటుపై బాబుతో ప్రామిస్ చేయించుకున్నారంట కన్నా లక్ష్మీనారాయణ. అయితే బాబు మాత్రం… అయితే సత్తెనపల్లి, కాకపోతే పెదకూరపాడు అని అన్నారంట. అయితే కొమ్మలపాటి శ్రీధర్.. పెదకూరపాడు విషయంలో గట్టిగా ఉన్నారని తెలుస్తుంది. దీంతో.. ప్రస్తుతం సత్తెనపల్లి కేంద్రంగా కన్నా రాజకీయాలు చేస్తున్నారు.
ఆ సంగతి అలా ఉంచితే… సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు కొత్త స్కెచ్ వేశారు. సత్తెనపల్లిలో వైసీపీని మరింత బలపరిచే ప్రయత్నం చేశారు. ఫలితంగా అటు కన్నాకు, ఇటు పవన్ కు ఉమ్మడి షాకిచ్చారు. అవును… మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి తాజాగా వైసీపీలో చేరారు. తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితోపాటు సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ సూరిబాబు కూడా వైసీపీలో చేరారు.
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓడిపోయారు. అప్పటినుంచి పవన్ ఈయన్ని పలకరించిన పాపానలోపేదు. దీంతో… బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు ప్రస్తుతం లేదని విమర్శిస్తున్నారు వెంకటేశ్వర రెడ్డి. వైసీపీలో చేరిన అనంతరం… తనకు ప్రస్తుతం ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన ఆయన… వైసీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకారం అందిస్తానన్నారు.
దీంతో ఒకపక్క జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి యర్రం వెంకటేశ్వర రెడ్డి, మరోపక్క ఇంతకాలం కన్నాతో కలిసి పనిచేసిన సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ సూరిబాబు.. ఒకేసారి వైసీపీలో చేరడంతో… సత్తెనపల్లిలో అంబటి బలం మరింత పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా… సత్తెనపల్లి విషయంలో కన్నా సెకండ్ థాట్ కి వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు.