విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయబోయే అభ్యర్ధిపై వైసిపి క్లారిటీ ఇచ్చేసినట్లేనా ? తాజా సమాచారం బట్టి అందరిలోను అదే అనుమానాలు మొదలయ్యాయి. వైసిపి అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాటలు విన్న తర్వాత అభ్యర్ధిపై క్లారిటీ వచ్చేస్తోంది. విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు కేంద్రంగా రెండు రోజులుగా విజయవాడలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మాజీ ఎంఎల్ఏ, సెంట్రల్ టిక్కెట్టు ఆశిస్తున్న వంగవీటి రాధాకృష్ణకు మద్దతుగా అనుచరులు ఎంత గోల చేశారో అందరూ చూసిందే.
సరే, ఆ తర్వాత జగన్ నుండి రాధాకు ఫోన్ రావటం, ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత రాధా కామ్ అయిపోవటం అందరికీ తెలిసిందే. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈరోజు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ విశాఖపట్నంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో కొందరు జగన్ ను కలిశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ అభ్యర్ధికి కేటాయించమని కోరినట్లు చెప్పారు. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారట. బ్రాహ్మణులకైతే సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయన్న వాదనతో జగన్ కూడా ఏకీభవించారట.
అందుకే వంగవీటి రాధాను విజయవాడ ఈస్టు నియెజకవర్గంలో పోటీ చేయమని నాయకత్వం కోరిందన్నారు. తూర్పు నియోజవకర్గంలో కానీ లేకపోతే మచిలీపట్నం ఎంపిగా కానీ పోటీ చేయాలని సూచించినట్లు చెప్పారు. అంబటి మాటలను బట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది మల్లాది విష్ణు అని అర్ధమైపోతోంది.