అమరావతి రగడ: సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 28న ఏం జరగబోతోంది.?

మూడు రాజధానులా.? ఒక్కటే రాజధానిగా వుంటుందా.? ఏం జరగబోతోంది.? ఈ నెల 28న ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశముంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయ్యింది. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలూ అమరావతికి ఆమోదం తెలిపాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.

కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక, అమరావతిని ‘కమ్మరావతి’ అంటూ ఎగతాళి చేయడం మొదలు పెట్టింది. ఆ కమ్మరావతిగా వైసీపీ పేర్కొన్న అమరావతిని కూడా శాసన రాజధానిగా పేర్కొంటూ, మరో రెండు రాజధానులు విశాఖపట్నం, కర్నూలు.. అంటూ కొత్త చట్టాన్ని వైసీపీ చేసింది. ఆ తర్వాత ఆ చట్టం చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది.

న్యాయపరమైన వివాదాలు రావడంతో, వైసీపీ సర్కారు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ, ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసీపీ సర్కారు. ఈ కేసు విచారణ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా పడింది. ఆ ఫిబ్రవరి 23న ఏం జరగోబోతందన్న ఉత్కంఠ సహజంగానే అంతటా నెలకొంది. ‘నేనూ విశాఖకు వచ్చేస్తున్నా.. విశాఖపట్నమే రాష్ట్రానికి రాజధాని..’ అంటూ ఈ మధ్యనే ఢిల్లీలో పెట్టుబడిదారుల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్
జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. ముఖ్యమంత్రి రాజధాని గురించి ఎలా మాట్లాడతారు.? అన్నది ఓ ప్రశ్న. ఏమో, ఫిబ్రవరి 23న ఏం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే.