ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో.. ఆర్-5 పేరుతో జోన్‌లో పేదలకు ఇళ్ళ స్థలాల్ని ఇప్పటికే వైసీపీ సర్కారు ఇచ్చింది. అంతే కాదు, ఆయా ఇళ్ళ స్థలాల్లో ఇళ్ళనూ నిర్మించబోతోంది. ఇటీవల ఆయా ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన కూడా జరిగింది.
ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం ఓ సారి.. శంకుస్థాపన కోసం ఇంకోసారి.. భారీగా జనసమీకరణ చేపట్టి, భారీ బహిరంగ సభల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తోంటే, విపక్షాలు అడ్డు తగులుతున్నాయంటూ ఆయా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే, రాజధాని అమరావతికి సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో వున్నాయి. రాజధాని రైతులు, వైఎస్ జగన్ సర్కారు చేపడుతున్న అనేక కార్యక్రమాలకు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వానికి తాము భూములు ఇచ్చామనీ, రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని రాజధాని అవసరాల కోసం మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగానే వినియోగించాలనీ రైతులు నినదిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాజధాని రైతుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇళ్ళ నిర్మాణాల్ని వెంటనే నిలిపివేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇళ్ళ పట్టాల పంపిణీకి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘విపక్షాలకు ఎదురు దెబ్బ’ అంటూ వైసీపీ వ్యాఖ్యానించింది. కానీ, ఈసారి ఆ ఎదురు దెబ్బ వైసీపీ ప్రభుత్వానికి తగిలినట్లయ్యింది.
సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పులోనూ, ఇళ్ళ పట్టాల కేటాయింపు అనేది తుది తీర్పుకి లోబడి వుంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతటి గందరగోళం నడుమ, హడావిడిగా ఇళ్ళ పట్టాల పంపిణీ, ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.
వైసీపీ సర్కారు, హైకోర్టులో ఈ మద్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తుందా.? సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.