‘కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నాం..’ అని ఆ మధ్య వైసీపీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి కావొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావొచ్చు.. ఇతరత్రా ముఖ్య నేతలు కావొచ్చు చెప్పడం చూశాం.. మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి.
కానీ, సుప్రీంకోర్టులో కేంద్రం అమరావతిపై దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం, ‘మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదు’ అని పేర్కొంది. అంతే కాదు, ‘రాజధాని ఎక్కడ.? అన్నదానిపై నిర్ణయం రాష్ట్రానిదే’ అని గతంలో చెప్పిన కేంద్రం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని వ్యవహారం.. విభజన చట్టానికి లోబడి జరిగిన నిర్ణయమని తేల్చి చెప్పింది.
అంటే, పూర్తిస్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి విషయంలో నరేంద్ర మోడీ నుంచి వెన్నుపోటుని ఎదుర్కొన్నారని అనుకోవాలా.? అని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడుస్తున్నారాయె.!
కేంద్రమేదో ఇప్పుడు అమరావతికి అనుకూలంగా మాట్లాడిందని అనలేం. సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ ఇవ్వడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే, ఇక్కడ నాలిక మడతేసే వ్యవహారాలకు ఆస్కారం లేకుండా పోయింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి ఏ చట్టం అయితే కారణమైందో.. ఆ చట్టంలోనే, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి స్పష్టతనిచ్చారు. సో, ఆ చట్టం ప్రకారమే రాజధాని అనేది నిర్ణయించబడింది. దాన్ని మార్చాలంటే, మళ్ళీ ఆ విభజన చట్టానికి అనుగుణంగానే జరగాలన్నది ఓ వాదన.
రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చాక.. ‘తూచ్.. ఒకటి కాదు, మూడు రాజధానులు’ అంటే ఎలా కుదురుతుంది.? ఇది అర్థం కానంత అమాయకులైతే వైసీపీలో లేరు. మరెందుకీ మూడు రాజధానుల నాటకం.?