ఏపీ రాజకీయాల్లో అమరావతి పాత్ర అత్యంత ప్రధానంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇంకా గట్టిగా మాట్లాడితే గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు కు ఆ స్థాయిలో ఘోర ఓటమి రావడానికి గల ప్రధాన కారణాల్లో అమరావతి కూడా ఒకటనే చర్చ నడిచింది. అయితే ఈ విషయంలో క్లాస్ వార్ అంటూ కొత్త అంశం తెరపైకి తెచ్చిన జగన్… అమరావతిలో పేదలకు స్థానం కల్పించే పనికి పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఒక కీలక అడుగు వెయ్యబోతున్నారు.
అవును… అమరావతిలో పేదలకు స్థానం లేదన్నట్లుగా టీడీపీ సర్కార్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో పంతం పట్టిన జగన్… అమరావతిలో పేదలకు కూడా స్థానం ఉందని బలంగా చెప్పాలని భావించారు. ఇందులో భాగంగా అమరావతిలో ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చారు.
దీంతో అమరావతిలో ఆర్-5 జోన్ వ్యవహారం సుఖాంతమైందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో… విపక్షాలకు ఇది మింగుడుపడని వ్యవహారంలా మారింది. ఈ సమయంలో వారి ఆవేదనను రెట్టింపుచేసేలా అన్నట్లు… జులై -8న అమరావతిలో పేదల ఇళ్లకు సామూహిక శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా… మొత్తం 47వేల ఇళ్లకు శంకుస్థాపనలు చేయబోతున్నట్టు ప్రకటన వెలువడింది.
కాగా.. ఇప్పటికే సీఎం జగన్ చేతుల మీదుగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇంటి నిర్మాణాలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమరావతి అంటే అది డబ్బున్న కమ్మ కులస్తుల గేటెడ్ కమ్యూనిటీ అని ఇన్నాళ్లూ విమర్శిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం… అక్కడ అందరికీ ఇళ్లు కట్టించి.. అమరావతి అందరిదీ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా… సుమారు 47వేళ ఇళ్లకు శంకుస్థాపనలు చేయబోతోంది.
ఇదే సమయంలో ఎన్నికలకు కాస్త ముందుగా ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి రూ.30కోట్లు మంజూరు చేసింది. దీంతో… వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ విపక్షాలపై బలంగా పడబోతుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.