అమరావతి రగడ: గెలిచేదెవరు.? ఓడేదెవరు.?

600 రోజుల పాటు ఉద్యమం జరగడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రాజధాని అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాలకు చెందిన కొందరు రైతులు మాత్రమే ఉద్యమంలో నిరంతరం పాల్గొంటున్నారు. నిజానికి, దీన్ని ఉద్యమం అనాలా.? టైమ్ పాస్ వ్యవహారం అనాలా.? అన్నది అర్థం కాని పరిస్థితి. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెల కట్టలేనిది. అయితే, ఇందులోకి రాజకీయం చొరబడింది. తెలుగుదేశం పార్టీ రంగు ఈ ఉద్యమానికి అందుకుంది. అదే అతి పెద్ద సమస్య. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి తెరలేపిందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఆరోపించడమే కాదు, అధికారంలోకి వచ్చాక.. పాత ప్రభుత్వం అక్రమాల్ని తవ్వి తీస్తోంది. సరే, ఈ ఆరోపణల్లో నిజమెంత.? అన్నది వేరే చర్చ. అసలు అమరావతిని మార్చాల్సిన అవసరమేంటి.? అన్న ప్రశ్నకు వైఎస్ జగన్ సర్కార్ వద్ద సరైన సమాధానం లేదు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఒకటి కాదు, మూడు రాజధానులని వైసీపీ సర్కార్ అంటోంది. మంచి ఆలోచనే ఇది. కానీ, ఏదీ ఎక్కడ.? కోర్టు కేసుల సంగతి పక్కన పెడితే, కనీసం అమరావతిలో అయినా రాజధాని పనుల్ని జగన్ సర్కార్ ముందుకు తీసుకెళ్ళలేకపోవడం పెద్ద తప్పిదం. శాసన రాజధాని పేరుతో శాశ్వత అసెంబ్లీ నిర్మాణానికైనా జగన్ సర్కార్ శ్రీకారం చుట్టి వుంటే, మిగతా రెండు రాజధానుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేది. కోర్టు కేసులు త్వరలో పరిష్కారమవుతాయనీ, మూడు రాజధానులు వచ్చి తీరతాయని పాత పాటే పాడుతున్నారు వైసీపీ నేతలు. రోజుల, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా, విషయం ఒక్క అడుగు కూడా ముందుకు కదలడంలేదు. బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు మంచిది కాదు. ఎవరు గెలుస్తారు అమరావతి విషయంలో.? అన్న ప్రశ్నకు సమాధానమేంటో తెలుసా.? ఎవరు గెలిచినా, అంతిమంగా ఓడిపోయింది మాత్రం రాష్ట్రమే.