అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: తేల్చి చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటు సాక్షిగా కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. వైసీపీ ఎంపీ (రాజ్యసభ) అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సమాధానమిస్తూ, రాష్ట్ర రాజధాని అమరావతేనంటూ పేర్కొనడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, రాజధానికి సంబంధించిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందనీ, ఆ కమిటీ సూచనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకుందని కేంద్రం పేర్కొంది.

రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న కేంద్రం, ఆ తర్వాత మూడు రాజధానుల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ బిల్లుని తీసుకొచ్చినా, దాన్ని వెనక్కి తీసుకుందని వివరించింది.

ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వుంది గనుక, రాజధాని విషయమై ఇంతకు మించి స్పష్టత ఇవ్వడం కుదరదని కూడా కేంద్రం పేర్కొనడం విశేషం. సో, ప్రస్తుత వైసీపీ సర్కారు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నోటిఫై చేసే వరకూ, అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటైన కమిటీ.. ఆ కమిటీ చేసిన సూచనల నేపథ్యంలో రాజధాని నోటిఫై చేయబడింది గనుక, రాజధానిని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదు.

కానీ, మార్చి నెలాఖరున విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షిఫ్ట్ అవుతారనీ, అదే రాష్ట్ర రాజధాని అవుతుందనీ వైసీపీ అంటోంది. వైసీపీకి చెందిన పలువురు మంత్రులూ ఇదే మాట చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో విశాఖే రాజధాని అని ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. కోర్టు పరిధిలో ఈ అంశం వున్నప్పుడు, ముఖ్యమంత్రి ప్రకటన.. కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా.? రాదా.?