జనసేన వైపు చూస్తోన్న అల్లు అరవింద్.?

ప్రజారాజ్యం పార్టీ పతనానికి చాలా కారణాలు చెబుతారు.. అందులో అల్లు అరవింద్ పాత్ర కూడా వుందంటారు.! అందుకే, జనసేన పార్టీ వైపు అస్సలు అల్లు అరవింద్‌ని రానీయకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం వుంది.

అయితే, అల్లు అరవింద్ విషయంలో పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితమైన అభిప్రాయం వుంది. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు అవసరాలు వేరు. 2024 ఎన్నికలకు సంబంధించి, జనసేన పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయిపోతే, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెడతారు జనసేనాని.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. అదీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి. ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చుగానీ, జనసేన పార్టీకి అల్లు అరవింద్ అందుబాటులో వుంటారని తెలుస్తోంది.

అల్లు అరవింద్ మాత్రమే కాదు, అల్లు అర్జున్ కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారం కోసం సంసిద్ధమవుతున్నాడట. ‘ఎన్నికల సమయంలో అవసరమైన అన్ని అవకాశాల్నీ సద్వినియోగం చేసుకుంటాం..’ అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు.. మెగాభిమానులకు ఇప్పటికే సంకేతాలు పంపారు.

మిగతా విషయాలెలా వున్నా, అల్లు అరవింద్ అవసరమైతే కొన్ని విషయాల్లో పార్టీకి తప్పనిసరి. ఆ విషయాలేంటన్నవి పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు. చిరంజీవి మాత్రం, జనసేనకు అందుబాటులో వుండకపోవచ్చట.