తుడిచిపెట్టుకుపోయిన ఫిరాయింపు మంత్రులు

రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరు అందలాలు ఎక్కుతారో ఎప్పుడు ఎవరు సైడైపోతారో ఎవ్వరూ  చెప్పలేరు.  తాజాగా వెల్లడైన ఫలితాలే ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. టిడిపిలో గెలిచి మంత్రులైన వారికన్నా ఫిరాయింపు మంత్రులే బాగా రెచ్చిపోయారు. జగన్ ప్రస్తావన వస్తే చాలు ఆకాశమంత ఎత్తున ఎగిరెగిరి పడేవారు.

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో చాలామంది మంత్రుల్లాగే ఫిరాయింపు మంత్రులు కూడా ఓడిపోయారు. ఫిరాయించిన 23 మంది ఎంఎల్ఏల్లో చంద్రబాబు నలుగురికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు. జగన్ ను తిట్టాలనుకున్నప్పుడల్లా చంద్రబాబు వీరితోనే ఆరోపణలు చేయించటం, తిట్టించిన విషయం అందరూ చూసిందే.

ఫిరాయించిన ఎంఎల్ఏల్లో సుజయ కృష్ణ రంగారావు, నూతనకాల్వ అమరనాధరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆది నారాయణరెడ్డిని మంత్రులను చేశారు. కారణ్య నియామకాల పద్దతిలో మరో ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టుల కాల్చి చంపారని కొడుకు కిడారి శ్రవణ్ కుమార్ కు కూడా మంత్రివర్గంలో చోటిచ్చారు.

చివరకు మొన్నటి ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు ఓడిపోయారు. పార్టీ ఫిరాయించటంతోనే జనాలకు వీళ్ళపై బాగా ఒళ్ళు మండిపోయింది. ఫిరాయింపులతో శ్రవణ్ కు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా  ఓటమి చూడాల్సొచ్చింది.  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఫిరాయించినందుకు వారిపై ఆయా నియోజకవర్గాల్లో  వారిపై జనాలు మండిపోయారు. దాంతో మొత్తం ఫిరాయింపు మంత్రులు తుడిచిపెట్టుకుపోయినట్లైంది.