తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ఆమె భర్తతో పాటు పలువురు అండర్ గ్రౌండ్ లో ఉండటం తెలిసిందే. కిడ్నాప్ ఉదంతంలో అఖిలప్రియ హస్తం ఉందని అనుమానించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. ఈ సందర్భంగా కిడ్నాప్ జరిగినట్లుగా చెబుతున్న ఉదంతానికి కారణమైన హఫీజ్ పేట భూ వివాదం గురించిన వివరాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు.
‘‘మా నాన్న భూమా నాగిరెడ్డికి హఫీజ్‌పేట సర్వే నంబర్ 80లో 33 ఎకరాల భూమి ఉంది. ఏవీ సుబ్బారెడ్డి ఆ భూములను పర్యవేక్షించేవాడు. 2005 నుంచి ఆ భూముల విషయంలో మా నాన్నకు కృష్ణారావు అనే న్యాయవాది సలహాదారుగా ఉండేవారు. ఆయన కుమారుడే ప్రవీణ్‌కుమార్, కృష్ణారావు మేనల్లుడు సునీల్‌రావు. కృష్ణారావు మరణంతో… ఆ బాధ్యతలను ప్రవీణ్‌కుమార్, సునీల్‌రావు తీసుకున్నారు. ఆ భూముల వెనక ఉన్న న్యాయవివాదాలను ఆసరాగా చేసుకుని.. మొత్తం స్థలాన్ని ఆక్రమించేశారు. వారి నుంచి లబ్ధి పొందిన ఏవీ సుబ్బారెడ్డి పక్కకు తప్పుకొన్నాడు. మా వాటా కోసం పోరాడాను.
ప్రవీణ్‌కుమార్, సునీల్‌రావుతో చర్చలకు ప్రయత్నించాను’’ అయితే.. వారి కిడ్నప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పోలీసులతో అన్నట్లు సమాచారం. దర్యాప్తు అధికారులను ఉద్దేశించి.. “అన్నా… ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి’’ అని ఆమె వ్యాఖ్యానించారని తెలిసింది. మూడు రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట మహిళా ఠాణాలో విచారించిన విషయం తెలిసిందే. విచారణలో ఆమె చాలా వరకు మౌనముద్ర దాల్చినట్లు… పక్కా ఆధారాలను చూపుతూ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆమె బదులిచ్చినట్లు సమాచారం.