వివేకా హత్యకేసు… తెరపైకి అనూహ్య పరిణామం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతకొంతకాలంగా ఒక వర్గం మీడియాలో ఇదే ప్రధాన వార్తగా వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది.

అవును… ఇప్పటికే అత్యంత రసవత్తరంగా సాగుతుందనే కామెంట్లు సంపాదించుకున్న వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తాజగా తెలంగాణ హైకొర్టులో మరో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా… రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం.. దాఖలు చేసిన రిట్ పిటీషన్‌ విచారణకు రానుంది.

వైఎస్ వివేకా హత్య కేసులో తన వాదనలను సీబీఐ తప్పుగా చిత్రీకరించిందంటూ ఆరోపించిన అజయ్ కల్లం… ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయంలో రిజిస్ట్రీ చేసిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.

దీంతో… అజయ్ కల్లం వేసిన పిటిషన్ ను త్వరలోనే దీన్ని మెయిన్ పిటీషన్ విచారణలోకి జోడించనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. తాను ఇచ్చిన స్టేట్‌ మెంట్‌‌ ను వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ మార్చేసి రికార్డ్ చేశారనేది అజయ్ కల్లం ఆరోపణ. ఈ హత్య కేసులో 2023 ఏప్రిల్ 9వ తేదీన అజేయ కల్లం స్టేట్‌ మెంట్‌ ను సీబీఐ రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ స్టేట్‌ మెంట్‌ తీసుకునే సమయంలో తాను చెప్పింది ఒకటైతే.. సీబీఐ దాన్ని పూర్తిగా మార్చివేసింద అజేయ కల్లం వాదన.

అదే విషయాన్ని ఆయన ఈ రిట్ పిటిషన్‌ లో పేర్కొన్నారు. వివేకా హత్యకేసు.. ఎలాంటి వివక్ష, పక్షపాతానికి అవకాశం లేకుండా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలు మీడియాలో రావడం తనను ఆశ్చర్యపరిచిందని, దర్యాప్తు అంశాలు బయటికి ఎలా వచ్చాయనేది అర్థం కావట్లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు.