రండి బాబూ రండీ… తిరుపతి విమానాశ్రయం అమ్మబడును!

“రండి బాబూ రండీ.. తిరుపతి విమానాశ్రయం అమ్మబడును. ఏటా రూ.200 కోట్లపైనే లాభాలు ఆర్జిస్తున్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం.. అతి తక్కువ ధరకు అమ్మబడును. ఆలసించిన ఆశాభంగం.. అయితే ఈ పిలుపు అందరికీ కాదు బాబూ.. కేవలం అంబానీ, లేదంటే.. అదానీలకు మాత్రమే” అనే సెటైర్స్ ని ఎదుర్కొంటుంది మోడీ సర్కార్.

అవును… ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడమే తమ లక్ష్యం… దిగిపోయేలోపు ఎన్ని ప్రభుత్వ సంస్థలు వీలైతే అన్ని సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడమే తమ కిం కర్తవ్యం అని గట్టి లక్ష్యం పెట్టుకున్నట్లు ముందుకుపోతున్న మోడీ సర్కార్… తాజాగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంపై కన్నేసింది. ఏటా రూ.200 కోట్లపైనే లాభాలు ఆర్జిస్తున్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం తాజాగా అమ్మకానికి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి విమానాశ్రయానికి రద్దీ ఎక్కువ. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఇక్కడకు భత్కులు, పర్యాటకులు వస్తుంటారు. దీంతో సహజంగానే తిరుపతి విమానాశ్రయానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని వసతులు కల్పించి విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం… అమ్మకానికి పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఒక్క తిరుపతి విమానాశ్రయమే కాకుండా ఏపీలో గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలను కూడా అమ్మేయ్యాలని మోడీ సర్కార్ ఫిక్సయ్యింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిత్వ శాఖ తాజాగా వెళ్లడించింది. ఇక్కడ మరో విషయం ఏమీటంటే… తిరుపతి విమానాశ్రయానికి కనీసం టెండర్లను కూడా పిలవకుండానే విక్రయించడానికి కేంద్రం సిద్ధమవుతుందట.

భారీ స్థాయిలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు, వెంకన్న భక్తులు వస్తున్న తిరుపతి ఎయిర్ పోర్టును దక్కించుకొనేందుకు జీఎంఆర్ – టాటా – రిలయన్స్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయట. అయితే… ఈ మూడింటిలో రిలయన్స్ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం! ఈ విమానాశ్రయాన్ని కారు చౌకగా దక్కించుకొని.. దీనిపక్కనే ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో రిలయన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు వందల ఎకరాల్లో మాల్స్, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు నిర్మించే ప్రణాళికల్లో రిలయన్స్ ఉందని అంటున్నారు!

ఏది ఏమైనా… తాను అధికారంలో ఉన్నంతకాలంలో… ఎయిర్ పోర్టులు, బ్యాంకులు, స్టీల్ ప్లాంట్లు మొదలైన భారీ వీలైనన్ని ప్రభుత్వ ఆస్తులను, ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలనే మోడీ కృతనిశ్చయం చూసి… అంబానీ – అదాని వంటి సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయంట!