తిరుపతి తర్వాత.. ఆ ఉప ఎన్నికలు కూడానా.?

tirupati elections

tirupati elections

ఆంధ్రపదేశ్‌లో త్వరలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఆ ఉప ఎన్నిక ఫలితం తర్వాత, పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయట. అందుకు తగ్గట్టుగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అధికార వైసీపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు సహా అనేక అంశాలకు సంబంధించి పొలిటికల్ హీట్ పెరుగుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయం.. అని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. వారిలో వల్లభనేని వంశీ తదితరులు చాలా యాక్టివ్‌గా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలోకి దూకేసి, వైసీపీ తరఫున యాక్టివ్‌గా వున్నారు. వీరంతా, రాజీనామాలపై వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా పొందిన తర్వాతే వైసీపీలోకి దూకేశారు. అసెంబ్లీ సాక్షిగా గతంలో వైఎస్ జగన్, ‘పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేస్తాం..’ అని ప్రకటించినా, ఆ మాటకు విలువ లేకుండా పోయింది. ఆ మాట నిలబెట్టుకునే దిశగా సరైన సమయం కోసం చూస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్, స్థానిక ఎన్నికల్లో పరిస్థితుల్ని అంచనా వేసి, ఉక్కు ఉద్యమం నడుస్తున్న తీరుని విశ్లేషించి కీలక నిర్ణయం తీసేసుకున్నారట. అయితే, ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక వేడి రాజుకున్న దరిమిలా, ఆ ఫలితం వచ్చాకే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించబోతున్నారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాగా, రాజీనామాల విషయమై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో వారితో చర్చించేందుకు, వారిని బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.