రాజకీయాల్లో తీవ్రపదజాలాలతో చేసే విమర్శలు ఒకెత్తు అయితే… మరికొన్ని సందర్భాల్లో ఎద్దేవా చేస్తూ, వెటకారంగా వదిలే విమర్శనాస్త్రాలు మరొకెత్తు. ప్రత్యర్థిని మానసికంగా కృంగదీయడంలో ఈ వెటకారపు మాటలు కీలక భూమిక పోషిస్తాయనడంలో సందేహం ఉండకపోవచ్చు. పైగా… ఆ వ్యక్తి స్థాయిని మరోసారి ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నానికి కూడా ఈ వ్యంగ్యం సహకరిస్తుందని అంటారు.
ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే… టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై వైసీపీ నేతలు ఆడుతున్న వెటకారం గురించి. ప్రజల మద్దతు పొందలేని వ్యక్తి ప్రజామోదం పొందిన వైసీపీ పై విమర్శలు చేయడంపై ఆ పార్టీనేతలు వేస్తున్న వెటకారల గురించి.
అవును… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సెటైర్స్ వేశారు. సోమిరెడ్డే కాదు మరే టీడీపీ నేతా సమాధానం చెప్పలేని, రివర్స్ కౌంటర్ వేయలేని రేంజ్ లో వేశారు. తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే జాతీయస్థాయిలో రికార్డుగా పరిగణించి ఆయనకు బహుమతి అందజేస్తామని ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఐదు సార్లు ఓడిపోయి రికార్డు సృష్టించాడని ఆయన ఎద్దేవా చేశారు. తన చేతిలో రెండుసార్లు, గోవర్ధన్ రెడ్డి చేతిలో రెండుసార్లు, కోవూరులో ఒకసారి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో నిత్యం ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొనే సోమిరెడ్డికి మొదటి నుంచి ఎవరో ఒకరిపై బురద జల్లడం అలవాటని ఆదాల తెలిపారు. ఆ పార్టీలో ఆయన తప్ప ఎవరూ ఉండకూడదనే మనస్తత్వం సోమిరెడ్డికి పుష్కలంగా ఉందని.. ఫలితంగా జిల్లాలో టీడీపీ సర్వనాశనం కావడానికి ఆయనే కారణం అని ఆదాల స్పష్టం చేశారు.
ఇలా ప్రజల్లో తనకున్న క్రెడిబిలిటీ మరిచిన సోమిరెడ్డి… సీనియర్ లీడర్ కోటాలో, చంద్రబాబు కోటరీ కోటాలో మంత్రి పదవులు కూడా పట్టేస్తుంటారని అంటుంటారు తమ్ముళ్లు. ఈ రకంగా సోమిరెడ్డిపై ఆదాల చేసిన వెటకారంపై టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ వేయడం లేదు సరికదా… లోలోపల ఆనందిస్తున్నారని తెలుస్తుంది. తాము నేరుగా అనలేని వ్యాఖ్యలు ఆదాల చేశారనేది వారి అభిప్రాయంగా తెలుస్తుంది.
కాగా నెల్లురు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ 10 సీట్లనూ గెలుచుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ విజయం వెనక వైసీపీ కష్టం ఎంతుందో… సోమిరెడ్డి చేతకాని తనం, ఆయన వ్యవహారశైలి కూడా కారణం అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.