నటి అపూర్వ, తనని ఒక రాజకీయ నాయకుడు వేధిస్తున్నట్టు చెప్పడం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమని టార్గెట్ చేసి, నరకం చూపిస్తున్నాడని ఇటీవల ఒక ఇంటర్వూలో అపూర్వ చెప్పుకొచ్చింది.
ఇప్పుడు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టిడిపి ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్ అనుచరులపై నటీ అపూర్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను చింతమనేని చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకొని ఆయన అనుచరులు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ఒకప్పుడు టిడిపి కార్యకర్తనేనని, కానీ ఇప్పుడు జరుగుతున్న అవినీతి, అన్యాయాలను చూసి టిడిపి నుంచి బయటకు వచ్చానని వివరించారు. టిడిపి లీడర్లు చేస్తున్న అరాచక పాలనపై బాబు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. తనని సీత అన్నా ఏమీ కాదు.. సిల్క్ స్మిత అన్నా ఏమీ కాదన్నారు. టిడిపి నేతల జాతకాలు తన దగ్గర ఉన్నాయని , అవి బయటపెడితే మీ పిల్లల్ల పిల్లలకు పెళ్లిళ్లు కావని పరోక్షంగా హెచ్చరించారు.
గతంలో అపూర్వ మాట్లాడుతూ… నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలిటిక్స్ పట్ల అవగాహన ఉంది, దెందులూరులో మాది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న ఫ్యామిలీ. మేం కమ్మవాళ్ళం. కానీ నాకు కులగజ్జి లేదు. ముందునుండీ టీడీపీకే ఓట్లు వేస్తున్నాం. స్టేట్ డివైడ్ అయినప్పుడు చంద్రబాబు గెలవాలని పూజలు చేసాను. మా దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని గెలిస్తే నేను హ్యాపీగా ఫీలయ్యా. అతనికి మేం ఓట్లేసి గెలిపించాం.. అలాంటిది, ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకుని మమ్మల్ని నానారకాలుగా టార్చర్ చేస్తున్నాడు. ఇంతకంటే వివరంగా ఇప్పుడేం చెప్పలేను.
దెందులూరులో ఈసారి చింతమనేని గెలిస్తే, మా ఆస్తులన్నీ అమ్ముకుని, హైదరాబాద్ వెళ్ళిపోతాం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అపూర్వ. ప్రస్తుతం తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన అపూర్వ సినిమాలు తగ్గించుకుని, ఊళ్ళోనే ఉంటూ తన తల్లిని చూసుకుంటోంది.
ప్రస్తుతం దెందులూరులోనే ఉంటుంది కాబట్టి, చింతమనేనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తే, ఆమెపై దాడికి పాల్పడతారనే ఉద్దేశంతోనే చాలా విషయాలు బయటకి చెప్పలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అపూర్వ చేసిన ఆరోపణలపై చింతమనేని ఎలా స్పందిస్తాడో చూడాలి.