మురళీ మోహన్ కోడలు రూప కే రాజమండ్రి టిడిపి ఎంపి సీటు

పార్టీ మీద అలిగి రాజమహేంద్రవరం టిడిపి ఎంపి మాగంటి మురళీమోహన్ పంతం సాధించుకున్నారు.

 ఆ మధ్య  తాను ఎన్నికల్లో పోటీచేయనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి అందరిని ఆయన ఆశ్చర్యపరిచారు. అసలు విషయం ఏమిటంటే… ఆయన తన కోడలు రూపకు టికెట్ అడిగి తాను తప్పుకోవాలనుకున్నారు. పార్టీ నుంచి దానికి స్పందన ఆశాజనకంగా లేదు. అందుకే  తాను రాజకీయాలనుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

అయితే, ఇపుడు సీన్ మారింది. బాగా ధనబలం ఉన్న మురళీ మోహన్ కుటుంబానికి టికెట్ కేటాయించడం ప్రస్తుతావసరం.

అందువల్ల రాజమహేంద్రవరం లోక్‌సభ టీడీపీ అభ్యర్ధిగా మాగంటి రూప పేరు ఖరారుచేస్తే తప్పేంటనే చర్చ పార్టలో జరిగింది.చివరకు రూపకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.

అయితే, ఈ నిర్ణయంతో ఈ టికెట్ మీద ఆశ పెట్టుకున్న గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావు షాక్ తిన్నారు. ఇక వీళ్లిద్దరికి ఏ టికెట్ వచ్చే అవకాశం లేదు. దీనితో వీరు పార్టీ మీద అలుక బూనారు. కొంపదీసి ఇతర పార్టీలోకి మారతారా అనే అనుమానంతో తెలుగుదేశం పార్టీ వీరిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఎందుకంటే గన్ని కృష్ణ సోదరుడు జీఎస్‌ఎల్‌ అధినేత గన్ని భాస్కరరావుతో మాజీ ఎమ్మెల్యే రాజమహేంద్రవరం లోక్‌సభ జనసేన అభ్యర్థి ఆకుల సత్యనారాయణ మంతనాలు జరిపారని టిడిపికి తెలిసింది. టిక్కెట్టు ఆశించిన బొడ్డుభాస్కరరామారావు కూడా తన అనుచరులతో సమావేశమై పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

సిటింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ తాను పోటీ చేయనని చెప్పడంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం అన్వేషించాల్సి వచ్చింది. అపుడు వీరి పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఒకరిని ఎంపిక చేయడం గ్యారంటీ అనుకున్నారు. అయితే, వారెవరూ గెలిచే అభ్యర్థులు కాదని పార్టీ సర్వేలలో తేలింది. దీని మీద వారం రోజులపాటు పార్టీ అధిష్ఠానం పలు చర్చలు, అభిప్రాయ సేకరణ తర్వాత అధిష్ఠానం మురళీ మోహన్ కోడలునే ఎంపిక చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చి మాగంటి రూప పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.