ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీద సొంత పార్టీ కార్యకర్తలే అసహనంతో ఉన్నారని సమాచారం. ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదులు గ్యాప్ లేకుండా వెల్లువెత్తుతున్నాయట. వైసీపీని నమ్ముకుని ఉన్నవాళ్లను పక్కనపెట్టి వైరిపక్షాల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత కేడరే ఆరోపిస్తోంది. చివరకు రెడ్డి సామాజికవర్గం వారిని కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారట. ఇలాంటి అంశాలను పోగేసి.. రాంబాబుకు వ్యతిరేకంగా వైసీపీ పెద్దలకు కార్యకర్తలు ఫిర్యాదులు చేసినట్టు ప్రచారం మొదలైంది.
అన్నా రాంబాబు 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిపోయారు. ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి.. భారీ మెజారిటీ రావడానికి తనతో కలిసి పనిచేసిన మాజీ పార్టీ శ్రేణులేనని రాంబాబు నమ్మి ఆ పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారట. ఈ విషయంపైనే వైసీపీ కేడర్‌కు, ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ వచ్చినట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకంతా మంచిరోజులేనని పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు భావించారు. కానీ.. ఎమ్మెల్యే తీరుతో ఆ సంతోషం ఆవిరైందని మండిపడుతున్నారు కార్యకర్తలు.
సొంత పార్టీలోని వారికి కాకుండా తనతోపాటు వైసీపీలోకి వచ్చిన వారికే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను సైతం రాంబాబు కట్టబెడుతున్నారని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. సైలెంట్‌గా ఉంటే లాభం లేదని భావించి ఫిర్యాదులపై ఫిర్యాదులు పెడుతున్నారట. దీంతో నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య పోరు కాకుండా.. ఎమ్మెల్యే రాంబాబు, వైసీపీ కేడర్ మధ్య ఫైట్‌గా రాజకీయాలు మారిపోయాయట. దీంతో అధిష్టానం ఈ విషయం మీద ఫోకస్ పెట్టి దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేశారని తెలుస్తుంది.