మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటాన్ని తెలుగుదేశంపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ ఎన్నిక తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు. ఇపుడా ప్రసంగంపైనే టిడిని నేతలు మండిపోతున్నారు. గవర్నర్ ప్రసంగం మొత్తం వైసిపి కరప్రతంగా ఉందని మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించటమే విచిత్రంగా ఉంది.
మామూలుగా గవర్నర్ ప్రసంగమంటే అధికారంలో ఉన్న పార్టీ ఏమి తాయారు చేసిస్తే దాన్నే గవర్నర్లు చదువుతారు. అందుకు నరసింహన్ కూడా మినహాయింపేమీ కాదు. మొన్నటి వరకూ ఐదేళ్ళ పాటు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏమి రాసిస్తే దాన్నే నరసింహన్ చదివిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ విషయం ఐదేళ్ళపాటు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుకు తెలీకుండా ఉంటుందని అనుకోలేం. ఇపుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్నే గవర్నర్ చదివారంతే. తమ ప్రభుత్వ ప్రాధాన్యాతలను జగన్ గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించారు.
అంత మాత్రానికి అచ్చెన్న తట్టుకోలేకపోతున్నారు. గవర్నర్ ప్రసంగం మొత్తం వైసిపి కరపత్రంగా ఉందన్న అచ్చెన్న వ్యాఖ్యలు ఆయన కడపుమంటకు అద్దం పడుతోంది. నిజంగా గవర్నర్ ప్రసంగం వైసిపి కరపత్రమే అయితే మొన్నటి వరకూ గవర్నర్ చదివిందంతా టిడిపి కరపత్రమేనా ?