జైలు జీవితం ఎలా గడుస్తోందో తెలుసా ?

జరుగుబాటుంటే జ్వరమంత సుఖం లేదని ఓ సామెతుంది. జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ పరిస్దితి కూడా జైలులో అలాగే ఉంది. హత్య చేసేందుకు జగన్  పై దాడి చేసిన కేసులో నిందితుడు విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉన్నాడు. మామూలుగా జైలు అంటే జనాలకు అక్కడ శిక్షలు వేస్తారని, కఠినంగా అమలు చేస్తారనే అభిప్రాయముంది. కానీ నిందితుడి విషయంలో పూర్తిగా రివర్సు జరుగుతోంది. జైలులో శ్రీనివాసరావుకు రాజభోగాలు అందుతున్నాయట. ఖర్మకాలి జైలు పాలైన వివిఐఫిలకు జరుగుతున్నట్లుందట శ్రీనివాసరావుకు జరుగుతున్న మర్యాదలు.

 

మామూలుగా అయితే ఖైదీలు తెల్లవారుజామునే లేవాలి. జైలు వార్డెన్ కేటాయించిన పనుల్లోకి వెళ్ళాలి. టైం ప్రకారం టిఫిన్, టైం ప్రకారం  భోజనానికి రావాలి. టైం దాటిపోతే టిఫిన్ కానీ భోజనం కాని ఉండదు. అలాగే మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తర్వాత మళ్ళీ సాయంత్రం చేయాల్సిన పనులుంటాయి. రాత్రి పూట భోజనంతో ఖైదీల దినచర్య ముగుస్తుంది. ఇది సాధారణంగా ప్రతీ ఖైదీకి జరిగే తంతు. ఇందులో మళ్ళీ వివిఐపి ఖైదీలకు మాత్రం కాస్త వెసులుబాటుంది లేండి. మిగిలిన ఖైదీలకు లాగే వివిఐపి ఖైదీలతో ఒంళ్ళొంచి పనిచేయించరు. అందుకు చాలా కారణాలుంటాయి.

 

కానీ జగన్ కేసులో నిందితుడికి వివిఐపి తరహా మర్యాదలు జరుగుతున్నాయట. మిగిలిన ఖైదీలతో చేయిస్తున్న పనులేవీ చేయించటం లేదట. ఉదయం టిఫిన్ అయినా మధ్యహ్నం, రాత్రి భోజనం అయినా చిత్రావతి అలర్ట్ బ్లాకులో ఉన్న రిమాండ్ ఖైదీ శ్రీనివాసరావు గదికే వస్తున్నాయట. సదుపాయాలన్నీ సక్రమంగా అందుతున్నది లేంది స్వయంగా జైలు డిప్యుటి సూపరెండెంట్ పర్యవేక్షిస్తున్నట్లు జగన్ మీడియా చెప్పింది. నిందితుడు అవసరాలు చూడటానికి ప్రత్యేకంగా బీహార్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన భాయ్, జలీల్, మిధుల్ అనే ఖైదీలే చూసుకుంటున్నారట.

 

నిందితుడిని ఇతర ఖైదీలతో కలవనీకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనబడుతోంది. తెలుగు వచ్చిన ఖైదీలైతే మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తాయేమననే బీహార్, ఒడిస్సా ఖైదీలను సహాయకులుగా నియమించారట. శ్రీనివాస్ కు ప్రతీరోజు మాంసాహారం అందిస్తున్నారు కాబట్టి వ్యక్తిగత సహాయకులకు కూడా అటువంటి భోజనమే అందుతోంది. జైలులోని ఇతర సిబ్బందిని కూడా నిందితుడితో మాట్లాడనీయటం లేదట. శ్రీనివాస్ కు జరుగుతున్న మర్యాదలు చూస్తుంటే ప్రభుత్వం ఇంటల్లుడిని చూసుకుంటున్నట్లు అర్ధమైపోవటం లేదు ?