ఈసారి రాజోలు టీడీపీ ఖాతాలో?

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. టీడీపీ – జనసేన పొత్తు ఆల్ మోస్ట్ కన్ ఫాం అంటూ కథనాలొస్తున్న తరుణంలో.. సీట్ల సర్ధుబాటు విషయంలో.. అధినేతల సంగతి ఎలా ఉన్నా అభ్యర్థులు మాత్రం తెగ టెన్షన్ పడిపొతున్నారు. అధినేతలకు అర్ధం కాని విషయాలను స్పష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రాజోలు నియోజకవర్గం తెరపైకి వచ్చింది.

గడిచిన ఎన్నికల సమయంలో “జగన్ సీఎం అవ్వరు.. ఇది శాసనం.. రాబోయేది జనసేన ప్రభుత్వమే” అంటూ స్పందించిన పవన్.. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో జనసేన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా కాపాడింది డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం!

రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ జనసేన తరుపున పోటీ చేసి తనకున్న సీనియారిటీతో, జనసేన కార్యకర్తల సహకారంతో పాటు కీలకంగా మారిన బీఎస్పీ ఓట్లతో గట్టేక్కారు. అయితే అది గతం. ఇప్పుడు రాజోలులో జనసేనకు బలమైన నాయకుడు లేడని, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి లేరని స్థానికంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే వాస్తవాలు మరిచో.. లేక, జనాలను ఏమార్చే పనిలో భాగంగానో… రాజోలు నియోజకవర్గం జనసేనకు కంచుకోట అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… గడిచిన ఎన్నికల్లో గెలిచిన జనసేనకు రాపాక సీనియారిటీ కూడా కలిస్తే వచ్చిన ఓట్లు 50,053, రెండో స్థానంలో నిలిచిన వైసీపీకి వచ్చిన ఓట్లు 49,239. కాగా… మూడోస్థానంలో నిలిచిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావుకి వచ్చిన ఓట్లు 44,592.

అంటే… బీఎస్పీ సౌజన్యంతో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం 32.92 కాగా… వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం 32.91! ఇక టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం 30.47. ఈ లెక్కలు గమనించిన ఎవరికైనా… ఇది జనసేనకు కంచుకోటో కాదో ఇట్టే అర్ధమైపోయే ఛాన్స్ ఉంది.

ఆ సంగతి అలా ఉంటే… అప్పుడు రాజోలు నియోజకవర్గంలో బీఎస్పీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటారు. వారికి తక్కువలో తక్కువ 1000 నుంచి 1500 ఓట్లు ఉంటాయని అంటున్నారు. అంటే ఈసారి జనసేనకు రాపాక వరప్రసాద్ లాంటి సీనియర్ నాయకుడు లేడు, బీఎస్పీ సహాయం లేదు. ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నట్లు లెక్క!

పైగా ఈసారి గొల్లపల్లి ని గెలిపించుకోవాలని పార్టీలకతీతంగా రాజోలు జనం భావిస్తున్నారనేది స్థానికంగా బలంగా వినిపిస్తున్నమాట. “పైన ఎవరొస్తారనేది తర్వాత విషయం.. రాజోలు లో మాత్రం రాపాకను గెలిపించుకుంటే బెటర్” అని పార్టీలకు అతీతంగా వినిపిస్తుండటం గమనార్హం.

ఈ వాస్తవ విషయం గ్రహించకుండా… రాజోలు అంటే జనసేన… జనసేన అంటే రాజోలు అన్నట్లుగా పరిస్థితి ఉందని జనసేన నేతలు భావించి పోటీకి దిగితే కష్టమనే భావన బలంగా వినిపిస్తుంది. ఇదే సమయంలో రాజోలు సీటు టీడీపీకి ఇచ్చి, అక్కడ నుంచి గొల్లపల్లి సూర్యారావుని గెలిపించుకుంటే ఫలితం దక్కుతుందనేది మరో సూచన. అలా కానిపక్షంలో రెంటికీ చెడ్డ రేవటిలా పరిస్థితి మారే ఛాన్స్ ఉందనే విషయం పవన్ తో పాటు.. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు కూడా గ్రహించాలని కోరుతున్నారు రాజోలు టీడీపీ కార్యకర్తలు.

మరి వాస్తవాలు, కార్యకర్తల అభిప్రాయాలు ఇలా ఉన్న సమయంలో… పవన్ రాజోలు విషయంలో ఎక్కువగా ఊహించుకుని, కంచుకోట వంటి ఊహలు పెట్టుకుని తప్పటడుగు వేస్తే.. పాత రికార్డ్ కూడా మాసిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు!