“లోకేష్ అంటే పొలిటికల్ ఫ్లవర్ అనుకుంటివా… టీడీపీ ఫ్యూచర్ ఫైరు” అని సీరియస్ అవుతున్నారు చినబాబు అభిమానులు. అది కూడా ఏ వైకాపా నేతపైనో, ఏపీ మంత్రిపైనో అనుకుంటే పొరపాటే. స్వయంగా టీడీపీ మేలుకోరే, చంద్రబాబు ఏమి చేసినా కరెక్ట్ అనే ఏబీఎన్ రాధాకృష్ణ పైనా. దీంతో… రాధాకృష్ణ కూడా వాస్తవాలు చెబుతారా.. ఫ్లోలో నిజాలు చెప్పేశారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు వైకాపా శ్రేణులు. ఇంతకూ ఆర్కే చెప్పిన ఆ నిజాలేమిటి? చినబాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్న ఆ అంశం ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం!
తాజాగా “చక్రం తిప్పేదెవరు?” శీర్షికతో రాసిన వ్యాసంలో ఆర్కే తనదైన శైలిలో టీడీపీ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. “జాతీయ స్థాయిలో ఏ పదవీ కోరుకోకుండా తలో దారిలో పయనించే ప్రతిపక్షాల నాయకులను సంఘటితం చేయడంలో చంద్రబాబుకు నేర్పరితనం ఉంది. అయితే ఆయన ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే తన రాజకీయ జీవితం ముగుస్తుందన్న భయంతో పాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు” అని రాసుకొచ్చారు. దీంతో రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!
ఒకటి చంద్రబాబుతోనే టీడీపీ భవిష్యత్తు ముగిసిపోతుందని. రెండోది… పార్టీ భవిష్యత్తుకు భయపడి మోడీ చేస్తున్న అరాచకాలను ఎదురించలేకపోతున్నారని. అవును… కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని ఫిక్సయినా.. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో సైడ్ అయిపోయినా.. చంద్రబాబు పట్టించుకోకపోవడానికి కారణం… టీడీపీ ఏమైపోతుందో అన్న భయమే అని ఆర్కే చెప్పకనే చెప్పారన్నమాట. అంటే… ప్రజలకంటే… రాష్ట్ర భవిష్యత్తు కంటే… తనకు పార్టీనే ముఖ్యమని బాబు భావిస్తున్నారని.. ఆర్కె కన్ ఫాం చేసేశారు!
ఇదే సమయంలో… చినబాబుని ఆటలో అరటిపండు చేసేశారు ఆర్కే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. “సమర్ధుడైన కొడుకు ఉన్నాడు.. బాబు సీఎంగా రాజినామా చేసి రాజకీయాలనుంచి తప్పుకోవాలనుకుంటున్నారు.. బాబు విశ్రాంతి తీసుకున్నా పార్టీ భవిష్యత్తుకు వచ్చిన నష్టం ఏమీలేదు.. టీడీపీ భవిష్యత్త్ ఆశాజ్యోతి లోకేషే…” అని చెప్పాల్సిన ఆర్కే… ఇలా బాబుతోనే టీడీపీ క్లోజ్ అని.. బాబు తర్వాత ఇక పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని చెప్పడం… లోకేష్ ను జోకర్ చేయడమేనని అంటున్నారు తమ్ముళ్లు.
దీంతో… లోకేష్ అంటే పొలిటికల్ ఫ్లవర్ అని ఆర్కే ఫిక్సయ్యారని కొందరంటుంటే… అది ఆర్కే మనసులో ఎప్పటినుంచో ఉన్న అభిప్రాయమే, ఇప్పుడు బయటపడ్డారతే అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు… బాబును లేపాలనే ఆలోచనతో చినబాబుని పూడ్చేశారని అంటున్నారు లోకేష్ ఫ్యాన్స్! మరి… దీనికి ఆక్రే మార్కు కవరింగ్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!