రాష్ట్ర విభజన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ కి 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా… తాను సీనియర్ మోస్ట్ లీడర్ ని అని, తన అనుభవం, తన జ్ఞానం ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరమని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. పవన్ వంటి వారు సైతం బాబుని నమ్మి.. మద్దతుగా నిలిచారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలిచింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. నాడు అక్కరకు రాని అనుభవం వల్ల చంద్రబాబు చేసిన ఒక అనాలోచిత పనివల్ల.. ఏపీకి రూ. 24కోట్ల ఫైన్ పడింది.. అది చెల్లించాలని కోర్టు సీరియస్ అయ్యింది!
అవును… రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వరం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే… కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించి ఇస్తుందన్నమాట. అయితే బాబు తనకున్న ప్రత్యేకమైన అనుభవంలో భాగంగా.. నాడు ఆ పనిని రాష్ట్రం చేతిలోకి తీసుకుని, పోలవరాన్ని ముందుకు సాగనివ్వకుండా.. పట్టిసీమ ఎత్తిపోతల, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుల్ని నిర్మించారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలతో పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్ లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జి.టి)ని ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించింది. దీంతో… పర్యావరణ ఉల్లంఘనలను ధృవీకరించిన న్యాయస్థానం.. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఏపీ ప్రభుత్వానికి రూ.24 కోట్లు జరిమానా విధించింది. అనంతరం ఎన్జీటి తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం… నిపుణుల కమిటీ ధృవీకరించిన జరిమానా రూ.24 కోట్లను చెల్లించాల్సిందేనని గతేడాది అక్టోబర్ – 17 న ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అంటే… నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో జరిగిన ఉల్లంఘనల పాపం.. నేడు వైసీపీ సర్కారుకి చుట్టుకుందన్నమాట!
అయితే ఏపీ సర్కార్ ఇప్పటికీ జరిమానా చెల్లించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయస్థానం… “మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి జరిమానా ఏమీ దానం కాదు.. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అంటూ హెచ్చరించింది. జరిమానా చెల్లింపుపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది!