తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కందుకూరులో బహిరంగ సభ నిర్వహించ తలపెట్టగా, అది కాస్తా 8 మంది ప్రాణాల్ని బలిగొంది. అందరూ సామాన్యులే. వారిని టీడీపీ అభిమానులగా ఆ పార్టీ అనుకూల మీడియా చెప్పడంలో వింతేమీ లేదు. అది నిజం అయితే అయి వుండొచ్చుగాక.!
తమ సభలకు జనం పోటెత్తుతున్నారని నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కొక్కర్నీ సభకు రప్పించేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఇప్పుడున్న రాజకీయాల్లో. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ముఖ్యమంత్రి సభలకీ జనాన్ని ఇలాగే తరలించాల్సిన దుస్థితి వచ్చింది.
8 మంది జనం చనిపోవడమంటే చిన్న విషయం కాదు. పది లక్షల నష్టపరిహారం చెల్లిస్తే సరిపోదు. ఈ తరహా ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడాలి. రాజకీయ పార్టీల సభల కారణంగా జనాల ప్రాణాలు పోకూడని రోజు రావాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
రోజు కూలీకి వెళితే ఓ ఐదొందలు వస్తాయ్.. అదే రాజకీయ పార్టీల సభలకు వెళితే వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకూ గిట్టుబాటవుతుంది గనుక.. కూలీనాలీ చేసుకునే వాళ్ళు గత కొంతకాలంగా రాజకీయ పార్టీల తరఫున పనిచేస్తున్నారు.. అదీ తాత్కాలికంగా.
అన్ని పార్టీల సభల్లోనూ వాళ్ళే ఎక్కువగా వుంటున్నారు. అలాంటివాళ్ళ ప్రాణాలు పోతే.. వారి కుటుంబాలు ఏమైపోతాయ్.? ‘మేం పూర్తిగా వారి కుటుంబాల్ని ఆదుకుంటాం..’ అని కందుకూరు ఘటన తర్వాత చంద్రబాబు ప్రకటించారు. కానీ, అది ఆచరణ సాధ్యమేనా.? ముమ్మాటికీ ఇవి రాజకీయ హత్యలే.. ఏ పార్టీ సభలో జరిగినా ఇదే రూల్ వర్తించాలి. నేరం సరే.. శిక్ష ఏమిటి.? ఎవరికి.?