వైఎస్ జగన్ సంక్షేమ పథకాల హడావుడి సామాన్యమైనది కాదు. రాష్ట్ర ప్రజలకు గతంలో ఏ ముఖ్యమంత్రీ ప్రకటించని సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ప్రకటిస్తున్నారు. వేల కోట్లతో వాటిని అమలుచేస్తున్నారు. ప్రచారంలో చెప్పిన ఒక్కో పథకాన్ని అమలుచేసుకుంటూ వస్తున్నారు. అమ్మ ఒడి మొదలుకుని తాజాగా అమలుచేసిన జగనన్న విద్యాకానుక అమలు వరకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాల కింద దగ్గర దగ్గర 50 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు లేకపోయినా, రెవెన్యూ లోటు భారీగా ఉన్నా, పాత అప్పులు కుప్పలుగా పేరుకుని ఉన్నా కొత్త అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు.
ప్రజలు ఖాతాల్లోకి డబ్బు పడుతోంది. ఆనందంగా మహిళలు వాటిని వాడుకుంటున్నారు. వాడుకున్నవారు ఊరుకోరు కదా జగనన్నను కీర్తిస్తున్నారు. ఆ పేరు ఈ పేరు చెప్పి ఏడాదికి ఇంతని డబ్బు చేతిలోకి వస్తుండటంతో వారందరికీ జగన్ దేవుడిలా కనిపిస్తున్నారు. ఆడవాళ్ళ వెర్షన్ ఇలా ఉంటే మగవారి వెర్షన్ వేరేలా ఉంది. ఎంతసేపూ తల్లుల ఖాతాల్లోకి డబ్బు వేస్తాం, అంత వేస్తాం ఇంత వేస్తాం అంటున్న ప్రభుత్వం మా జేబులను మాత్రం గుల్ల చేస్తోందని నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అందులోనూ పేదలు, దిగువ మధ్యతరగతి మగవారే ఈ బాధలు పడుతున్నారు. వీరిలో ఎక్కువమంది బాధపడేది మద్యం ధరల పెంపు గురించి. 75 సుమారు శాతం వరకు మధ్యమ ధరలు పెరిగిపోయాయి. దీంతో సంపాదించిన సొమ్మంతా బ్రాందీ షాపుల్లో కట్టేసి ఒట్టి చేతులతో ఇంటికి పోవాల్సి వస్తొందని వాపోతున్నారు.
గతంలో 500 సంపాదిస్తే 200 వందలు మద్యానికి పోగా మిగతాది ఇంట్లో ఇచ్చేవారమని కానీ ఇప్పుడు ఐదువందల్లో మూడు నుండి నాలుగొందల సేవించడానికి పోతుంటే ఇక ఇల్లు గడిచేది ఎలాగని, మధ్య నిషేధం పేరుతో ధరలు పెంచేస్తే మందు తాగడం మానేస్తారనేది అవాస్తమని ఫీలైపోతున్నారు. అంతేకాదు కూరగాయలు, పప్పులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఆదాయం పెరగకుండా ఖర్చులు పెరిగిపోయాయని, లాక్ డౌన్ మూలంగా మరింత చితికిపోయామని, ఇలా ఆడవాళ్లకు ఏడాదికి ఎంతో కొంత చేతిలో పెట్టి ప్రతి రోజూ మగవారి జేబులు ఖాళీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చాలదన్నట్టు తాజాగా ప్రభుత్వం 8.44 లక్షల రేషన్ కార్డులను తొలగించి వేసింది. ఇది కేవలం ఒక్క నెలలో జరిగింది. గత నెలలో రేషన్ తీసుకున్నవారికి ఈ నెలలో రేషన్ ఇవ్వట్లేదట. డీలర్ల వద్ద ఫింగర్ ప్రింట్ కూడ రిజెక్ట్ అవుతోందట. అంటే రేషన్ జాబితాలో వారి పేరు ఇకపై లేనట్టే. నాలుగు చక్రాల వాహనం, 10, 12 వేల నెలసరి ఆదాయం, వ్యవసాయ భూములు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం లాంటి కారణాలు చెప్పి కార్డులను తొలగించారు. ఈ సంగతి తెలిసి కార్డులు కట్ అయిన జనం తలలు పట్టుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని కార్డులు తెగుతాయో తెలియదు. ఇదంతా చూస్తున్న జనం జగనన్న చేయూత మాదిరి జగనన్న కోత పథకాన్ని అమలు చేస్తున్నారా ఏంటి అని అడుగుతున్నారు.