కొత్త అసెంబ్లీలోకి 70 కొత్త ముఖాలే ప్రవేశిస్తున్నాయి. వీటిల్లో వైసిపి నుండి 67 మంది కాగా తెలుగుదేశంపార్టీ నుండి ముగ్గురున్నారు. మొత్తం 175 మంది ఎంఎల్ఏలున్న అసెంబ్లీల్లో 70 మంది మొదటిసారి గెలిచిన ఎంఎల్ఏలున్నారంటే మామూలు విషయం కాదు. సీట్ల షేరింగ్ లాగ ఇందులో కూడా టిడిపి నుండి ప్రవేశిస్తున్నది కేవలం ముగ్గురే కావటం గమనార్హం.
రాయలసీమలో 52 అసెంబ్లీలుంటే ఇందులో 25 మంది మొదటిసారి ఎన్నికైన వారే. ఉత్తారంధ్రలో 34 శాసనసభ స్ధానాలుంటే మొదటిసారి ఎంపికైన వారి సంఖ్య 12. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో మొదటిసారి గెలిచిన వారు 13 మందున్నారు. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కలిపి 55 అసెంబ్లీ స్ధానాలుండగా మొదటిసారి ఎన్నికైన ఎంఎల్ఏలు 19 మందున్నారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా అనంతపురం జిల్లాలో తొమ్మిది మంది గెలిచారు. నెల్లూరు జిల్లాలో ఒక్కళ్ళు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున గెలిచారు. గుంటూరు జిల్లాలో 8 మంది ఎంటరవుతున్నారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుమంది, ఐదుమంది విశాఖపట్నం జిల్లా నుండి ఉన్నారు. కర్నూలు జిల్లా నుండి ఐదుమందున్నారు. ఇలా ప్రతీ జిల్లా నుండి నలుగురు, ఐదుగురు చొప్పున గెలిచారు.
