వైసీపీకి అర్థ సెంచరీ కూడా కష్టమేనా.?

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకేసారి జరుగుతాయా.? వేర్వేరుగా జరుగుతాయా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. తెలంగాణలో అయితే, ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటేనే, తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

నిజానికి, తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయ వాతావరణం ఇంకాస్త వేడిగా వుంది. అదీ ఎన్నికల వాతావరణం.! ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడతారు.? అన్నదానిపై ఎడాపెడా సర్వేలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ జరుగుతున్నాయిగానీ, తకకువ.!

తాజాగా, ఓ సర్వే వెలుగు చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించి. ఎవరు చేశారు.? అన్నదానిపై స్పష్టత లేదు. ‘ఐ-ప్యాక్’ సర్వే అంటున్నారు.. కాదు కాదు, టీడీపీ సర్వే అంటున్నారు. ఇవేవీ కాదు, వైసీపీ అంతర్గత సర్వే అంటున్నారు.

సర్వే సారాంశమేంటంటే, వైసీపీ కేవలం 35 నుంచి 40 సీట్లకే వచ్చే ఎన్నికల్లో పరిమితం కాబోతోందట.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ పక్కన పెడితే, రాష్ట్రంలో వైసీపీ ప్రజా ప్రతినిథుల్లో ఈ ముప్ఫయ్ ఐదు.. నలభై మంది మాత్రమే.. గ్రౌండ్ లెవల్‌లో ప్రజలతో మమేకం అయి వున్నారు.

నిజానికి, ఈ సంఖ్య కూడా చాలా ఎక్కువే.. ప్రజలతో కనెక్ట్ అవుతున్న వైసీపీ ప్రజా ప్రతినిథులకు సంబంధించి. ఈ విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ తెలుసు. అందుకే, పదే పదే ప్రజా ప్రతినిథుల్ని హెచ్చరిస్తున్నారు. అయినా, వారిలో మార్పు రావడంలేదు. మీడియా ముందుకొచ్చి బూతులు తిట్టడానికే చాలామంది వైసీపీ ప్రజా ప్రతినిథులు పరిమితమవుతున్నారు. తద్వారా విపక్షాల మీద వైసీపీ నేతలే సింపతీ క్రియేట్ చేస్తున్నట్లవుతోంది.

ఇక, సర్వే విషయానికొస్తే.. ఇది జస్ట్ హంబక్.! వైసీపీ ఓడిపోయేంతలా, విపక్షాలేవీ బలపడలేదు. అనూహ్యంగా ఈ సర్వే ఫలితం గనుక నిజమయ్యిందంటే.. దానికి బాధ్యత వైసీపీ ప్రజా ప్రతినిథులదే కాదు, వారిని దార్లో పెట్టలేకపోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది కూడా.!