ఏపిలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ళలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా ? కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారం 409 మంది ఆత్మహత్యలు చేసుకున్నారట. రైతుల ఆత్మహత్యలు, అందుకు కారణాలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రశ్నవేశారు. అందుకు కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాల సమాధానమిస్తు నాలుగేళ్ళ కాలంలో 409 మంది మరణించినట్లు చెప్పారు. మరణించిన రైతుల సమాచారం కూడా కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారమే కేంద్రమంత్రి సమాచారం ఇచ్చారు.  రాష్ట్ర స్ధాయిలో, జిల్లా స్ధాయిలో రైతు ఆత్మహత్యలపై నిర్ధారించిన లెక్కలనే తాము చెప్పినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అంటే రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర స్ధాయిలో మాత్రం ప్రభుత్వం ఎక్కడా మాట్లాడటం లేదు.

 

బోరు బావుల వైఫల్యం, భారీ ఖర్చుతో వాణిజ్య పంటల సేధ్యం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవటం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవటం, వర్షాభావం, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల, పిల్లల చదువుల కోసం ఎక్కువ వడ్డీలకు అప్పులు చేయటం, అనారోగ్యం తదితర కారణాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

 

వ్యవసాయం అన్నది రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశమని వ్యవసాయ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రప్రభుత్వాలపైనే ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పటం గమనార్హం. విధాన పరమైన చర్యలు, బడ్జెట్ మద్దతు ద్వారా ఆయా రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందంటూ రూపాల తెలిపారు. 

 

కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదేమిటంటే, రైతులకు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదు. రైతులు కష్టపడి పండిచిన పంటల్లో ఎక్కువ భాగం దళారీల పాలవుతోంది. రైతులకేమో కిలో టమోటాలు 2 రూపాయలకన్నా గిట్టకపోయినా మార్కెట్లో మాత్రం కిలో టమోటాలు 20 రూపాయలు ధర పలుకుతోంది. మధ్యలో దళారీల ఎక్కువైపోవటం వల్లే  రైతుల పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకల్లాగ అయిపోయింది.