వైసీపీ నుంచి టీడీపీలోకి 30 మంది ఎమ్మెల్యేలు జంప్.?

అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ‘మా ఎమ్మెల్యేల్ని నలుగుర్ని టీడీపీ కొనేసింది.. మరికొంతమందిని కొనేందుకు ప్రయత్నించింది..’ అంటూ అధికార వైసీపీ గగ్గోలు పెట్టడమేంటి.? తెలంగాణలో అధికార పార్టీకి షాక్ ఇవ్వడానికి అక్కడ విపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీ ప్రయత్నించి అడ్డంగా బుక్కయిపోవడం అందరికీ తెలిసిన విషయమే.

ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడు కాగా, ఏళ్ళు గడుస్తున్నా ఆ కేసు అలా అలా సాగుతూనే వుంది. ఆయనిప్పుడు ఎంపీ.. పైగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కూడా. రాజకీయాలంటేనే ఇలా వుంటాయ్.! ఇంత జుగుప్సాకరంగా జరుగుతాయ్.! ఆంధ్రప్రదేశ్‌లో కనీసం అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యూహాల్ని అర్థం చేసుకోలేకపోతోంది. అంతా జరిగిపోయాక గగ్గోలు పెడుతోందంటే, అధికార యంత్రాంగం తాలూకు వైఫల్యమే అనుకోవాలేమో.! 10 నుంచి 20 కోట్లు ఒక్కో ఎమ్మెల్యేకీ ఆశ చూపి, తమవైపుకు టీడీపీ తిప్పుకుందన్నది వైసీపీ ఆరోపణ.

మరి, ఆ దిశగా అరెస్టులు జరిగి వుండాలి కదా.? ఆ సంగతి పక్కన పెడితే, తాము రెండో అభ్యర్థిని నిలబెట్టడానికి వీలుగా వైసీపీ ఎమ్మెల్యేల నుంచే ఒత్తిడి వచ్చిందనీ, ముప్ఫయ్ మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని టీడీపీ నేతలు పెద్ద బాంబు పేలుస్తున్నారు. ఇదో రకం మైండ్ గేమ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అయినా, కేసులు నమోదు చేసి.. అరెస్టులకు ఉపక్రమించాలి కదా.? అదీ జరగడంలేదాయె.! ఇది అధికార వైసీపీ అలసత్వానికి నిదర్శనంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఆ రకంగా చూస్తే, టీడీపీ మైండ్ గేమ్ ఫలిస్తున్నట్టే వుంది.