పాతిక, ముప్ఫయ్, నలభై.. యాభై.! ఇదేం బేరం పవన్ కళ్యాణ్.?

డెబ్భయ్ ఐదు సీట్లు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నారు.. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో. టీడీపీ 100 సీట్లలో పోటీ చేస్తే, జనసేన 75 సీట్లలో పోటీ చేస్తే, గౌరవ ప్రదంగా వుంటుందనీ, ఇరు పార్టీల మధ్యా సజావుగా ఓటు ట్రాన్స్‌ఫర్ అవుతుందనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

నిజానికి, ఇదే అభిప్రాయం చంద్రబాబుకీ వుంది. అయితే, పార్టీలో నేతలందర్నీ సంతృప్తి పరచడం చంద్రబాబుకి కష్టమే. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీకి అభ్యర్థున్నారు. జనసేన పార్టీ పరిస్థితి వేరు. టీడీపీ 2019 ఎన్నికల తర్వాత బలహీన పడినా, ఆ పార్టీకి వున్న బలమైన క్యాడర్ నేపథ్యంలో అభ్యర్థుల కొరత లేదు.

జనసేన విషయానికొస్తే, గట్టిగా 100 నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. అక్కడిదాకా ఎందుకు.? ఓ యాభై నియోజకవర్గాల్లో పోటీకి నిలబెట్టగలిగే అభ్యర్థులెవరబ్బా.? అంటే, బూతద్దం వేసి వెతకాలి. అయినాగానీ, ఇటీవలి కాలంలో జనసేన పార్టీలో చేరికలు పెరుగుతున్నాయ్.

‘యువత మా పార్టీకి బలం. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తాం..’ అంటున్నారు జనసేనాని. వినడానికి ఇవన్నీ బాగానే వుంటాయ్. జనసేనాని పూర్తిగా రెండు మూడేళ్ళుగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టి వుంటే, ఇన్‌ఛార్జిల్ని నియమించి, పార్టీ నిర్మాణం చేసి వుంటే, 100 నియోజకవర్గాల్లో అయినా అభ్యర్థులు వుండేవారు.

‘మనం వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే, ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడగలం..’ అని జనసేనాని పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. కానీ, ఆయా నియోజకవర్గాల్లో నాయకుల్ని తయారు చేయాల్సింది అధినేతే కదా.!

ఇదీ వాస్తవ పరిస్థితి. 75 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేనప్పుడు, అన్ని సీట్లు జనసేనాని గట్టిగా అడగలేరు కదా. ఓ అరవై – అరవై అయిదు అయితే.. అంటూ సాగదీస్తున్నారట. కాదు, పాతిక కంటే ఎక్కువైతే కష్టమని టీడీపీ అంటోందిట. ముప్ఫయ్ నుంచి నలభై ఐదు వరకు లెక్క తేలుతుందన్నది తాజా సమాచారం.