మళ్ళీ తొక్కేసిన పచ్చ రాజకీయం.! ఈసారి ముగ్గురి బలి.!

ఎక్కడో తేడా కొడుతోంది.! గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. జనం బలైపోతున్నారు. రాజకీయ పార్టీల సభలంటే జనం భయపడే పరిస్థితి వచ్చేలా వుంది. 2023లో ప్రధాన రాజకీయ పార్టీలు మరింత ఉధృతంగా జనంలోకి వెళ్ళబోతున్నాయి. కానీ, ఈ తొక్కిసలాటల పరిణామాలు చూస్తోంటే, రాజకీయ పార్టీల బహిరంగ సభల వైపు జనం కన్నెత్తి చూసే పరిస్థితి వుండదేమో.?

ఛత్.! అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, చనిపోయినోళ్ళకి లక్షల మొత్తంలో ఆర్థిక సాయం చేసేస్తున్నాయి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. ఆ సొమ్ముతో పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ, రాజకీయ పార్టీల పబ్లిసిటీ స్టంట్లైతే జోరుగా సాగుతాయ్.

చిత్రమేంటంటే, నెల్లూరు జిల్లాలో మొన్న జరిగిన తొక్కిసలాట.. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన తొక్కిసలాట.. రెండూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల నేపథ్యంలోనే కావడం. చంద్రన్న కానుకలట.. అలాగని స్థానిక టీడీపీ నేతలు ఓ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు ప్రసంగించి వెళ్ళిరు.. ఇంతలోనే, అక్కడ కానుకలు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిందట.

గతంలో 8 మంది ప్రాణాలు కోల్పోతే.. ఈసారి ముగ్గురు బలైపోయారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. అత్యంత దురదృష్టకరమైన ఘటన ఇది. టీడీపీ కార్యక్రమాల్లోనే ఇలాంటి తొక్కిసలాటలు జరగడమేంటి.?

‘ఏం, మాకు సభలు నిర్వహించడం చేతకాదా.? ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం. పోలీసులు సరిగ్గా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి..’ అంటూ చంద్రబాబు మొన్న గుస్సా అయ్యారు.. నెల్లూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనపై. ఈసారి కూడా చంద్రబాబు అదే పాట పాడతారేమో.!