విజయదశమి రోజున మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర ప్రజలంతా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్యే, సినీ నటి, మంత్రి రోజా ‘ఉచిత సలహా’ ఇచ్చారు. రాజధాని అనేది కేవలం 29 గ్రామాలకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పరిమితమైన అంశం కాదంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతోంది. అందులో అమరావతి కూడా ఒకటి. అలాంటప్పుడు, ఆ అమరావతిని 29 గ్రామాలకు పరిమితం చేయాలనుకోవడమేంటి.? ఆ అమరావతిపై విషం చిమ్మడం ద్వారా వైసీపీ సభ్య సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తోంది.
నిజానికి, అమరావతిని పూర్తిగా వదిలేసి.. రెండు రాజధానులని వైసీపీ చెప్పినా, దానికి అర్థం వుండేది. మూడు రాజధానులు రాష్ట్రానికి అవసరమంటారు.. అమరావతిని కమ్మరావతిగా అభివర్ణిస్తూ, ఆ అమరావతికి భూములిచ్చిన రైతుల్ని నానా రకాలుగా తిడుతుంటారు. ఇక్కడే వైసీపీలో స్పష్టత కొరవడుతోంది.
కొన్నేళ్ళ క్రితం.. అంటే, చంద్రబాబు హయాంలో విజయదశమి సందర్భంగానే అమరావతికి శంకుస్థాపన జరిగింది. అప్పట్లో అన్ని దేవాలయాల్లోనూ రాజధాని అమరావతికి అనుకూలంగా పూజలు జరిగాయి. ఇప్పుడేమో, ఆ అమరావతిపై విషం చిమ్ముతూనే, ఆ అమరావతిని కలుపుకుని మొత్తంగా మూడు రాజధానులకు అనుకూలంగా పూజలు చేయాలని మంత్రి రోజా పిలుపునిస్తున్నారు.
అయితే అమరావతి.. లేదంటే, అమరావతిని తీసేసి రెండు రాజధానులనో, అమరావతి స్థానంలో ఇంకోటేదో పెట్టి.. మొత్తంగా మూడు రాజధానులనో అంటే, వైసీపీ వాదనకు అర్థం వుంటుంది.