3 రాజధానులే 2024 ఎన్నికల ఎజెండా: తేల్చేసిన వైసీపీ.!

ఇది క్లియర్ అన్నమాట.! 2024 ఎన్నికల్లోపు రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశం లేదు. వున్న ఒక్క రాజధానినీ, వైసీపీ సర్కారు గుర్తించే ప్రసక్తి లేదు.! అప్పటిదాకా రాజధాని వున్నా లేనట్టే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.! వైసీపీ తాజాగా తేల్చేసిన విషయం చూస్తోంటే, 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మూడు రాజధానులు.. లేదంటే, అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధాని. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచినా, మూడు రాజధానుల అంశం ముందుకెళుతుందో, ఇంకో ఐదేళ్ళు నానుతుందో చెప్పలేం.

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, 2024 ఎన్నికల్లో తమ ఎజెండా మూడు రాజధానులని తాజాగా ప్రకటించారు. దీనర్థం, 2024 ఎన్నికల వరకూ మూడు రాజధానుల అంశంతో పొలిటికల్ డ్రామా కొనసాగుతుందనే.! అదేంటీ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖలోనే రాజధాని కార్యకలాపాలని ఇటీవల ఇదే ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు కదా.?

అదంతే, ఈ రాజకీయం ఇంతే.! వైసీపీ నినాదం మూడు రాజధానులు.! ఆ నినాదాన్ని నిజానికి, తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎవరికైనా. కానీ, ఒక్కటే సమస్య. ఇప్పటికే వున్న రాజధాని అమరావతిలో మౌళిక సదుపాయాలు కల్పించి, చంద్రబాబు హయాంలో నిర్మాణాలు ప్రారంభమై, వైసీపీ అధికారంలోకి రాగానే ఆగిపోయిన భవనాల నిర్మాణాల్ని కాస్తయినా కొనసాగించి వుండాల్సింది.

గడచిన మూడున్నరేళ్ళుగా రాజధాని అమరావతి గురించి వైసీపీ అస్సలేమాత్రం ఆలోచన చేయలేదు. అలాంటిది, మూడు రాజధానులంటూ వైసీపీ చెబితే ప్రజలెలా నమ్ముతారు.? ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీలోనే ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం అర్థమవుతోంది.
2024 ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే ఎజెండా.. అని చెబుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటలకి వైసీపీలో విలువ ఎంత.? అన్నదీ ఆలోచంచాల్సిన విషయమే.