2019 ఎన్నికలకి కొత్త ఆయుధాల్లేని చంద్రబాబు

(టి రమేశ్ బాబు)

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆ ఒత్తిడికి అనేక కారణాలున్నా ప్రధానంగా మూడింటిని పేర్కొనవచ్చు. 1) ప్రపంచం విస్తుపోయే రాజధాని నిర్మిస్తానని చెప్పి చేయలేకపోవడం, 2) ప్రజల్ని మెప్పించి ఓట్లు రాబట్టే  హామీలేవీ నెరవేర్చకపోవడం, 3) జగన్ ఫ్యాక్టర్ కు పెరుగుతున్న ప్రజామోదం. ఈ మూడు కారణాలు బాబును విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. బహుశా ఆ ఒత్తిడి వల్లనే.. వచ్చే ఎన్నికల నాటికైనా కనీస స్థాయిలోనైనా ప్రజల మెప్పు పొందే పనులు చేయాలన్న ఆలోచన ఆయనకు కలగడం లేదనిపిస్తోంది. అందుక్కారణం.. వైఫల్యాలు కళ్ల ముందే కనిపిస్తున్నా అంగీకరించే మానసిక సంసిద్ధత బాబులో లేకపోవడం. అదే ఉన్నట్టయితే.. నష్ట నివారణ చర్యలు ఈపాటికి తీసుకునేవారే. కానీ అలాంటిదేదీ జరగలేదు. బాబు వైఫల్యాలకెల్లా అతిపెద్ద వైఫల్యం రాజధాని నిర్మాణం.

రాజధానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేసినప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ కన్నా ఎంతో అద్భుతంగా, ప్రపంచమంతా అసూయపడేలాగా నిర్మిస్తానని ఎంతో ఉద్వేగంగా మాట్లాడిన చంద్రబాబు నాలుగేళ్లయినా ఆ ఒక్క ప్రాజెక్టే పూర్తి చేయలేకపోయారు. కేంద్రం ఇచ్చిన రూ. 1500 కోట్లతో కేవలం తాత్కాలిక భవనాల పేరుతో సచివాలయానికి మమ అనిపించారు. ప్రజలందరూ ఆనందించే 2 లక్షల ఉద్యోగాలు గానీ, రైతు రుణాల మాఫీ గానీ చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదు. పోలవరం ప్రాజెక్టును అమాత్యులంతా బుద్ధి పుట్టినప్పుడు చూసి రావడానికయ్యే ప్రచార ఆర్భాటమే తప్ప అక్కడ పనిజరిగి కొలిక్కి వచ్చిన దాఖలాల్లేవు. కేంద్రం నిర్వహించాల్సిన ప్రాజెక్టులో అనవసరంగా జోక్యం చేసుకొని విమర్శలు ఎదుర్కోవడం తప్ప… వాటి నుంచి బయటపడే మార్గమే బాబుకు తెలియడం లేదు. అన్నిటికన్నా ప్రజల సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా అంశాన్ని అవసరార్థం వాడుకున్న అపఖ్యాతి తప్ప.. దాన్నుంచి చంద్రబాబుకు రాజకీయంగా ఒరిగే ప్రయోజనమైతే కనిపించడం లేదు. ఈ వైఫల్యాలన్నీ ఇప్పుడు జగన్ కు అస్త్రాలుగా మారగా.. అవే అస్త్రాలు పవన్ కూడా సంధిస్తుంటే బాబుకు నమ్మదగ్గ మిత్రులెవరూ దరిదాపుల్లో కనిపించడం లేదు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడికి ఇది తీవ్రమైన నైరాశ్యం కలిగించేదే.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ సజీవంగా ఉంచిన హోదా అస్త్రాన్నే బాబు తనకు అనుకూలంగా మలచుకోజూస్తున్నారు. అయితే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి మరింత దూకుడుగా సవాలు చేస్తుండగా…. 70 ఏళ్లకు చేరువైన చంద్రబాబుకు అదెంత చిరాగ్గా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన 23 మంది ఎమ్మెల్యేలు, అందునుంచి నలుగురిని మంత్రులుగా చేసుకున్న వైనం మీద మౌనంగా కాలం గడుపుకొస్తే అది ప్రజామోదం కాదని గ్రహించాలి. ఇక చంద్రబాబు కూడా సెంటిమెంట్ గా భావించే తిరుమలలో పోటు వసారాలో తవ్వకాలు, గుప్తనిధుల తరలింపు ఆరోపణల్ని టీడీపీ పరివారం లైట్ తీసుకోవచ్చు గానీ.. ప్రజలు మరచిపోకుండా చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నాడన్నదే ఆయన్ను నిద్రకు దూరం చేస్తున్న అంశం. అంతేకాదు.. ఇలాంటి గుప్తనిధుల సేకరణకు సంబంధించి చంద్రబాబు మీద గతంలో కూడా కొన్ని ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉండడం వేరే సంగతి.

ఇన్ని ఆరోపణలు, విమర్శలు, స్వయంకృతాపరాధాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న చంద్రబాబు సంయమనంగా ఎలా వ్యవహిరిస్తారో ఊహించడం కష్టమే. నాలుగేళ్లకు పైగా కాలంలో 15 శాతం పనులైనా పూర్తి చేయలేకపోయిన బాబు.. వచ్చే ఎన్నికల కోసం ఎలా సంసిద్ధమవుతారు? మళ్లీ తనను గెలిపించాలని ఏ విధంగా మనస్పూర్తిగా ప్రజల ముందుకెళతారు? ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలు, ప్రజల డిమాండ్లను పట్టించుకోకుండా కేవలం బీజేపీని చూపించి మాత్రమే బాబు సక్సెస్ అవుతాననుకుంటే అది కల్ల.

(* టి.రమేశ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)