కోవిడ్ విజృంభిస్తోంది, స్కూళ్ళు తెరవడానికి వీల్లేదు. కోవిడ్ పాండమిక్ దారుణంగా వుంది.. పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు.. ఇలా సాగింది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం, విద్యార్థులకు సంబంధించి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే వున్నాయి.
అప్పట్లో టీడీపీ సహా విపక్షాలన్నీ, విద్యార్థుల ఆరోగ్యం గురించి తెగ బాధపడిపోయాయనీ, ఇప్పుడు ఫలితాల గురించి ప్లేటు తిరగేసి మాట్లాడుతున్నాయనీ వైసీపీ విమర్శిస్తోంది. మరి, వైసీపీ చేసిందేంటి.? ‘మేం పరీక్షలు నిర్వహించి తీరతాం.. స్కూళ్ళు తెరిచి తీరతాం..’ అని భీష్మ ప్రతిజ్ఞలు చేసేసి, ‘విద్యార్థుల క్షేమం దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేస్తున్నాం.. స్కూళ్ళను ఆలస్యంగా తెరుస్తాం..’ అని వైసీపీనే చెప్పింది.
విపక్షాలు అమరావతిని రాజధానిగా కావాలని కోరుతున్నాయి. వైసీపీ, అందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు కదా.? విద్యార్థుల విషయంలో విపక్షాల డిమాండ్లకు వైసీపీ తలొగ్గిందని ఎలా అనగలం.?
పదో తరగతి పరీక్ష్లలో విద్యార్థులు పెద్దయెత్తున ఫెయిల్ అవడం క్షమార్హం కాదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానిదీ తప్పుంది.. అదే సమయంలో, విపక్షాలదీ తప్పుంది. కానీ, తప్పుని తప్పులా అంగీకరించే విజ్ఞత రాజకీయ పార్టీలకు ఎక్కడుంటుంది.?
అందుకే, ఇంతా జరిగాక ఇప్పుడు మళ్ళీ కొత్త రచ్చ మొదలైంది. తప్పు నీదంటే, నాదంటూ గింజుకుంటోన్న రాజకీయ పార్టీల్నీ, నాయకుల్నీ చూసి ఫెయిలయిన విద్యార్థులు, పాసైన విద్యార్థులూ నవ్వాలో ఏడవాలో తెలియక బిక్కమొహం పెడుతున్నారు.