హ్యాట్సాఫ్ : కరోనా మృతదేహాన్ని డాక్టరే  స్వయంగా..!  

కరోనా మహమ్మారి కారణంగా మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం ఒక్కటే కాదు బంధాలు, బందుత్వాలు కూడా దూరమయ్యాయి. మానవత్వం సన్నగిల్లింది. కరోనా సోకిన వ్యక్తికి మనోధైర్యం అందడం లేదు కానీ, మనోవేధన మాత్రం బాగానే మిగులుతుంది. ఇక కరోనాతో చనిపోతే కనీసం శవానికి అంత్యక్రియలు జరిపేందుకు కూడా చాలా మంది భయపడుతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో ఓ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు కరోనా మృతదేహాన్ని తరలించేందుకు డ్రైవర్‌గా మారాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి మున్సిపల్ సిబ్బంది నిరాకరించడంతో డాక్టర్ శ్రీరామ్, ఆసుపత్రి సిబ్బంది కలిసి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించారు.

అయితే ఓ పక్క కరోనా సోకిన వారిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే, మరో పక్క ఇలా కరోనా మృతదేహన్ని తరలించేందుకు ట్రాక్టర్ డ్రైవర్‌గా మారిన డాక్టర్ శ్రీరామ్ మానవత్వానికి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ అంటున్నారు.