ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. టెక్నాలజీ సహాయంతో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని ఈసీ హైకోర్టుకు తెలిపింది. ఓటర్ల తుది జాబితాతో పాటు, నోటిఫికేషన్ ను ఈ నెల 12 న విడుదల చేస్తామని ఈసీ తెలిపింది. దీంతో విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో ఓటర్ల జాబితాలో పలు అక్రమాలు ఉన్నాయని, అది క్లియర్ అయిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన సుప్రీం హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. దీంతో హైకోర్టు విచారించి వివరాలు అందజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
ఓటర్ల జాబితానే కాకుండా కొత్త ఓటర్ల నమోదు అంశం పై కూడా కేసు ఉంది. ముందస్తు ఎన్నికల వల్ల దాదాపు 20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కాకపోవడంతో వారు ఓటుహక్కును కోల్పోయే అవకాశం ఉందని ఎన్నికలకు సమయం ఉన్నందున కొత్త ఓటర్ల నమోదు తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మరో పిటిషన్ దాఖలైంది. మరీ దీనిపై కూడా కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.