స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఆంధ్ర ప్రదేశ్ లో యుద్ధ వాతావరణం!

హైకోర్టు తీర్పు వెలువడీ వెలువడక ముందే రాష్ట్ర ప్రభుత్వం రహస్య జీవోలు వెలువరించి బిసిలకు 24 శాతంతో రిజర్వేషన్లు ఖరారు చేయమని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.ఇదిలా వుండగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిసిలకు అన్యాయం జరుగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. దానికి కొనసాగింపుగా గురువారం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.మరో వేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ శుక్రవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించుతున్నారు. జనసేన నుండి స్పందన లేదు గాని గురువారం రాష్ట్ర బిజెపి నాయకుల సమావేశం విజయవాడలో జరిగింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రహస్య జీవోలు విడుదల చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ముఖ్యమంత్రిపై విమర్శలు సంధించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు స్పందన ఏలా వుంటుందో?

అయితే ఎన్నికలు జరిగితే వైకాపా ఏక పక్షంగా వెళ్లే అవకాశాలు తక్కువగానే వుంటాయి. ఎందుకంటే ఒక్క టిడిపి అయితే మరోలా వుండేది. కాని బిజెపి జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీలో వున్నందున ఎవరో ఒకరు వైకాపాను ఎదుర్కొనే పరిస్థితి వుండబోతోంది.అయితే రాష్ట్రంలో జరిగే చర్చలు ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయత్ రాజ్ చట్టానికి చేసిన సవరణలపై ప్రతి పక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. . ఈ సవరణలు ఆధారం చేసుకొని పోలీసులను ఉపయోగించి ప్రతి పక్షాలపై కేసులు నమోదు చేసే ప్రమాదముందని ఆ ఉద్దేశంతోనే ఈ సవరణలు చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంత బాలెన్స్ గా మాట్లాడినా అధికార పార్టీ నేతల వేపు పోలీసులు కన్నెత్తి చూచే అవకాశం వుండదని ప్రతి పక్షాల ఆరోపణ.

మరీ టిడిపి కన్నా రెండడుగులు బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ వేసి తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటున్నారు. మరీ ఎన్నికలు వచ్చే సరికి ఈలాంటి ఆరోపణలు వెల్లువెత్తే అవకాశముంది.ఇదిలా వుండగా మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చేసినట్లు ప్రచారంలో వున్న వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో మరింత కాక పుట్టిస్తోంది. మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని తమ నియోజకవర్గాల్లో 90 శాతం గెలుపు సాధించక పోతే పదవులు వదులు కోవాలని చేసిన సూచన వైకాపా శ్రేణులు ఎన్నికల్లో వీర విహారం చేసేందుకు తోడ్పడుతుందని ప్రతి పక్షాలు భావిస్తున్నాయి. తెగ బడి పని చేయండని ముఖ్యమంత్రి లైసెన్సు ఇచ్చినట్టు భావిస్తున్నారు. దీనికి తోడు ఎక్కువగా ఏకగ్రీవాలు వుండాలని ముఖ్యమంత్రి ఆదేశించడమంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇక మూడినట్లు కూడా భావిస్తున్నారు.ఇదే పరిస్థితులు కొనసాగితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినా ఆశ్చర్యం పోవలసిన అవసరం వుండదు. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అప్రతిష్ట మూట గట్టుకొని వుంది. తుదకు హైకోర్టు కూడా తప్పు పట్టి వుంది. ఎన్నికలు జరిగి ముగిసే లోపు ఏమౌతుందో చూడాలి