స్థానికంలో టీడీపీకి చుక్కలే… అభ్యర్థులు దొరుకుతారా..?

స్థానిక ఎన్నికలలో గెలుపు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు వ్యహాలను అమలు చేస్తున్నారు. ఒకటి ప్రత్యర్థి పార్టీలకి అభ్యర్థులను లేకుండా చేయడం, రెండు సొంత పార్టీ నేతలకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు చావో రేవో తేల్చుకుని పోరాడమని హెచ్చరించడం. ఆల్రెడీ ఆ వ్యూహాన్ని ఆచరణలో కూడా పెట్టేశారు. దాని ఫలితాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి.

ఇప్పటికే స్థానిక ఎన్నికలో నగదు, మద్యం వంటివి పంచి గెలిస్తే, దానిపై ఫిర్యాదు వస్తే వెంటనే అనర్హత వేటు తప్పదని, జైలు శిక్ష కూడా అవుభవించాలని ఏకంగా ఆర్డినెన్స్ తెచ్చారు జగన్. అంటే ఎన్నికలకు ముందుగానే టీడీపీ నుంచి పోటీ చేయలాంటే భయపడేలా ఈ ఆర్డినెన్స్ ద్వారా ఒక రకంగా అంతా భయపడే వాతావరణం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రిపై ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం. జగన్ ఆర్డినెన్స్‌ను ప్రస్తావిస్తూ దాని ద్వారా వైసీపీ గెలుపు ఖాయమని చెప్పేశారు. అంతటితో ఆగక తన వర్గం అసలు పోటీలోనే ఉండదని కూడా స్పష్టం చేశారు. అంతటినేతనే తన వర్గం పోటీ చేయదని చెప్పేయడంతో ఇప్పుడు టీడీపీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపేందుకే ఆ పార్టీ అధిష్టానానికి చుక్కలు కనిపించేలా ఉన్నాయి.  

అలాగే ప్రజల్లో నెలకొన్న కాస్తో.. కూస్తో వ్యతిరేకత కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, సొంత పార్టీ నేతలను హెచ్చరించడానికి కారణాల్లో ఇది కూడా ఒకటని రాజకీయ విశ్లేషకుల మాట. దీంతో ఓ వైపు తెలుగు దేశం పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు దొరకని పరిస్థితి కల్పించడంతోపాటు.. వైసీపీ నేతలకు కూడా సంకట స్థితిని తెచ్చి పెట్టింది. మరి జగన్ రెండు వ్యూహాల ఫలితం గెలుపును అందిస్తుందా.. చిక్కులు పెడుతుందా అనేది ఎన్నికల తర్వాత చూడాలి.